చంద్రబాబుకోసం: జగన్‌పార్టీ నేత ఇంట్లో లగడపాటి బస!

అందులో భాగంగా అతను ఆదివారం రాత్రే అనుమంచిపల్లెకు చేరుకున్నారు. బాబు యాత్ర సోమవారం కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఆ సమయంలో ఆయనను కలిసేందుకు అనుమంచిపల్లెకు చేరుకున్న లగడపాటి గ్రామంలో జగన్ పార్టీకి చెందిన నేత ఇంట్లో ఉన్నారని చెబుతున్నారు. దీనిని కాంగ్రెసు పార్టీ నేతలు ఖండిస్తున్నారు. అతను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కాదని, కాంగ్రెసు నేత అన్నారు.
అయినా సమైక్యం కోసం పార్టీలకతీతంగా ఎవరి ఇంట్లోనైనా లగడపాటి ఉంటారన్నారు. దీనిపై లగడపాటి స్పందించారు. తాను కొండయ్య ఇంట్లో ఉన్నానని, ఏ పార్టీకి సంబంధించిన వారనే అంశంతో తనకు సంబంధం లేదని, సమైక్యవాదులు ఎవరైనా తాను వారింట్లో ఉంటానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు సమైక్యవాదులు ఉన్నా వారి ఇళ్లలోనూ తాను ఉంటానని చెప్పారు. కొండయ్య తమ పార్టీకి చెందిన సీనియర్ నేత అన్నారు.
తనను అరెస్టు చేసేందుకు పోలీసులకు ఎలాంటి కారణాలు లేవన్నారు. ఎవరి పైనా తాను దౌర్జన్యానికి పాల్పడలేదన్నారు. శాంతియుతంగానే బాబును కలిసే యత్నం చేస్తున్నానని చెప్పారు. అది కూడా బాబు ఒప్పుకుంటేనే కలుస్తానని ఒత్తిడి మాత్రం చేయనని అన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ యువకుడు అని, ఆయనకు ఆవేశం ఎక్కువని, సమైక్యం కోసం చిత్తశుద్ధి కలిగిన నేత అన్నారు.
తాను బాబును కలిసేందుకు గాంధేయ మార్గాన్ని విడిచి ఒక్క అడుగు కూడా వేయనన్నారు. బాబునే కాదు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వచ్చినా తాము పూలతో స్వాగతిస్తామన్నారు. బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కాగా స్నానం, ధ్యానం ముగించుకొని తాను బయటకు వస్తానని లగడపాటి అన్నారు. మరోవైపు బాబుకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు తరలి వస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!