ఉండవల్లి రాజమండ్రి సభ: తెలంగాణ వర్సెస్ సమైక్యాంధ్ర

ఉండవల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు రాయలసీమ నేతలు ఎందుకు వెళ్లారని, అక్కడికి దగ్గర్లోనే ఉన్న పెద్దాపురం అందాలు చూసేందుకేమైనా వెళ్లారా అని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. సదస్సుకు తెలంగాణ నుంచి పిల్లికూన కూడా వెళ్లలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దాదాపు మార్గం సుగమమైనట్టు పరిస్థితులను బట్టి తెలుస్తోందన్నారు. రాయలసీమ తమ ఆధీనంలోనే ఉందని చాటేందుకు ఆంధ్ర నేతలు ఉండవల్లి, రాయపాటి, లగడపాటి చేసిన ప్రయత్నమే జై ఆంధ్రప్రదేశ్ సదస్సు అన్నారు.
శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎదురుగానే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను అడ్డుకున్నారు. రాజమండ్రి సభలో పాల్గొనడంపై వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తనకు హక్కుందని బొత్స చెప్పారు. అయితే రాజీనామా చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. అందుకు ససేమీరా అనడంతో మా సమావేశాలకు వస్తారా అని జానా రెడ్డి ప్రశ్నించారు. పిలిస్తే వస్తానని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
చీలిన కాంగ్రెస్
రాజమండ్రిలో ఆంధ్రా కాంగ్రెస్ నేతలు, హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా సమావేశాలు జరుపుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండుగా చీలిందని కాంగ్రెస్ విధానం రెండు రాష్ట్రాల కింద లెక్కేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
తెలంగాణ యువత చావులమీద అధికార అందలం ఎక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నేతలను విమర్శించానే కానీ తాను ఏనాడూ విద్యార్థులను, ప్రజలను విమర్శించలేదన్నారు. వేర్పాటువాదులు విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని రాజగోపాల్ వాపోయారు.
విమర్శలతోనే జాప్యం
రాష్ట్రంలోని సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటుండడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంలో కేంద్రం జాప్యం చేస్తోందని ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ పేరిట తెరాస, మతం పేరిట మజ్లిస్ బతుకుతున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కంటే 2014 ఎన్నికల్లో బలం కూడదీసుకునేందుకే తెరాస నాయకులు ప్రాధాన్యమిస్తోందన్నారు.
బొత్స విచక్షణే వదిలేస్తున్నాం
పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ రాజమండ్రి సభకు హాజరు కావడం ఆయన విచక్షణే వదిలేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ శనివారం బొత్స సత్యనారాయణను ఉద్దేశించి అన్నారు.
తంతామన్నవాళ్లనే రజాకార్లు అన్నాడు
తెలంగాణపై వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్‌కి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి మద్దతు పలికారు కొడతాం..తంతాం అంటున్నవారినే ఉండవల్లి రజాకార్లు అన్నాడని అన్నాడు. ఎవరినీ ఆయన అవమానించలేదని చెప్పారు.
రాష్ట్రమంతా జరగాలి
రాష్ట్రంలో వేర్పాటు, సమైక్య ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో ప్రజలు వాస్తవాలను తెలుసుకునేందుకు, రాజమండ్రి తరహా సభలు రాష్ట్రమంతా జరగాలని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌తోపాటు ప్రతిజిల్లాలోనూ సభలు నిర్వహిస్తే ప్రజల మధ్య రాగద్వేషాలు పోతాయని తెలిపారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కలుకాదనీ, తెలుగుజాతి ఐక్యంగానే ఉంటుందన్న నమ్మకం వ్యక్తంచేశారు.
పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు గతంలో ఎమ్మెస్సార్, డి.శ్రీనివాస్, కె కేశవ రావులు తెలంగాణ గురించి మాట్లాడారని, ఇప్పుడు బొత్స ఆంధ్రా ప్రాంత వ్యక్తిగా అక్కడ జరిగిన సమావేశానికి వెళ్లారని మల్లు రవి అన్నారు. తెలంగాణపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన అదే సభలో చెప్పారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications