ఓయులో టెన్షన్: రాళ్ల వర్షం, బాష్పవాయు ప్రయోగం
హైదరాబాద్: తాము ఏ క్షణంలోనైనా ఇందిరాపార్కు వద్దకు వెళ్లి సమర దీక్ష చేపడతామని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఆదివారం అన్నారు. సమరదీక్షకు వస్తున్న పలువురు తెలంగాణవాదులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఐకాస కార్యలయంలో నిరసన దీక్ష చేపట్టారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పుడైనా తాము ఇందిరాపార్కుకు చేరుకొని సమర దీక్ష కొనసాగిస్తామన్నారు. తన దీక్ష ఇక్కడే ప్రారంభమైందన్నారు.
నాన్చుడు ధోరణి సరికాదు
తెలంగాణపై కేంద్రం నాన్చుడు ధోరణి సరికాదని తెరాస ఎమ్మెల్యేలు కె తారక రామారావు, హరీష్ రావులు అన్నారు. తెలంగాణపై 2009లో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోకపోతే కాంగ్రెసు పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సీమాంధ్ర సర్కారులా కనిపిస్తోందన్నారు. రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ సభకు, హైదరాబాదులో శైలజానాథ్ సమావేశాలకు అనుమతి ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తాము శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన తెలుపుతామన్నారు.
పలువురు తెరాస ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సమర దీక్షను చేపట్టారు. ఇందిరాపార్కు వద్ద న్యూడెమోక్రసీ కార్యకర్తలు అరెస్టయ్యారు. పలువురు తెలంగాణవాదులు ఇందిరాపార్కులోకి చొచ్చుకెళ్లి సమరదీక్ష చేసే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సీమాంధ్ర సభలకు అనుమతిచ్చి సమర దీక్షకు అనుమతి ఇవ్వక పోవడం ప్రభుత్వ, పోలీసుల దమననీతికి నిదర్శనం అని ఎంపి మందా జగన్నాథం అన్నారు.

గన్ పార్కు వద్ద ప్రజా యుద్ధ నౌక గద్దర్ తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. సమర దీక్షకు అనుతించక పోవడం దారుణం అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సమరదీక్షకు అనుమతి ఇప్పించక పోవడం దారుణం అని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర నేతలను చూసి మనవారు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి భజన చేసేందుకే వారికి సమయం సరిపోతోందని ఎద్దేవా చేశారు.
ఓయు విద్యార్థుల ర్యాలీ
సమర దీక్షకు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ఓయు గేటు వద్ద, విద్యానగర్ చౌరస్తా వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఉస్మానియా క్యాంపస్ చుట్టూ పోలీసులను మోహరించారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా పోలీసులు చూస్తున్నారు. విద్యార్థులు రాజ్ భవన్ ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు తమను అడ్డుకోవడంతో వారిపై రాళ్లు రువ్వారు. పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. దీంతో ఓయు మరోసారి ఉద్రిక్తంగా మారింది.
తమ తెలంగాణ తమకు కావాలంటూ ఓ కుటుంబం తెలంగాణ సమర దీక్షలో పాల్గొంది. అల్వాల్ నుండి భార్యాభర్తలు తమ పిల్లలతో సహా వచ్చి దీక్షలో పాల్గొన్నారు. పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడి నుండి తరలించారు. తాము అల్వాల్ నుండి వచ్చామని, తమ తెలంగాణ తమకు కావాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications