బంగాళాఖాతంలో భారీగా చమురు నిక్షేపాలు
అండమాన్ షాలో ఆఫ్ షోర్ బ్లాక్‌లో ఆయిల్ ఇండియా చేపట్టిన అన్వేషణలో మరో విజయం లభించింది. ఈ ప్రాంతంలో ఆ సంస్థ తవ్విన మూడవ బావి 'విజయపురం-3'లో సహజ వాయువు నిల్వలు ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ బ్లాక్‌లో ఆయిల్ ఇండియా మొత్తం మూడు బావులను తవ్వగా, రెండింట్లో హైడ్రోకార్బన్ల ఉనికిని గుర్తించడం విశేషం. గతేడాది సెప్టెంబర్‌లో రెండవ బావిలో కూడా గ్యాస్ ఆనవాళ్లను కంపెనీ గుర్తించిన సంగతి తెలిసిందే.
అండమాన్ తీరానికి బంగాళాఖాతంలో 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రాంతం. ఈ బావిలో 1,900 మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉన్న ఇయోసీన్ ఫార్మేషన్‌లో చేసిన ప్రారంభ ప్రయోగాల ద్వారా సహజ వాయువు ఉనికిని గుర్తించినట్లు ఆయిల్ ఇండియా వెల్లడించింది. పెర్ఫొరేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఒత్తిడి పెరిగి, గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైనట్లు పేర్కొంది. నిరంతర ఫ్లేరింగ్ ద్వారా లభించిన ఫలితాలు ఈ అన్వేషణలో కీలక మలుపుగా మారుతాయని ఆయిల్ ఇండియా స్పష్టం చేస్తోంది.

పెట్రోబ్రాస్, టోటల్ ఎనర్జీస్, బీపీ ఇండియా, షెల్, ఎక్సోన్ మొబైల్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి దేశ చమురు, సహజవాయు నిక్షేపాల అన్వేషణను మరింత ముందుకు తీసుకెళ్తామని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఆయిల్ ఇండియా సాధించిన ఈ అరుదైన విజయం పట్ల ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రస్తుతం గ్యాస్ నాణ్యత, అందులోని రసాయన కూర్పు, దాని సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఆయిల్ ఇండియా శాంపిల్స్ సేకరిస్తోంది.
గ్యాస్ మూలాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవడంలో భాగంగా దాని ఐసోటోప్ అధ్యయనాలు కూడా నిర్వహించనుంది. రెండో బావికి సంబంధించి అప్రైజల్ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించామని సంస్థ వెల్లడించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 2డీ సెయిస్మిక్ డేటాను తిరిగి ప్రాసెస్ చేయడంతో పాటు, అదనంగా 600 చదరపు కిలోమీటర్ల మేర 3డీ సెయిస్మిక్ డేటాను సేకరించినట్లు ఆయిల్ ఇండియా తెలిపింది.
దీనిపై కేంద్ర మాజీమంత్రి, బీజేపీ లోక్ సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఓ ట్వీట్ చేశారు. అండమాన్ దీవుల సమీపంలోని లోతట్టు సముద్ర జలాల్లో సహజ వాయువు నిల్వలను ఆయిల్ ఇండియా గుర్తించడాన్ని చారిత్రాత్మక మలుపుగా అభివర్ణించారు. ఇంధన రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరింత బలాన్నిచ్చే గొప్ప విజయంగా పేర్కొన్నారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, ఇంధన భద్రతను పెరుగుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications