జగన్ పార్టీ, కాంగ్రెసు లూటీ: గొంతు నొప్పితో చంద్రబాబు

కృష్ణా జిల్లా విజయవాడ నగరం తూర్పు నియోజకవర్గంలోని శాతవాహన కాలేజీ వద్ద నుంచి సోమవారం పాదయాత్ర కొనసాగించారు. మొగల్రాజపురం, సిద్ధార్థ సెంటర్, సున్నపు బట్టీలు, నిర్మలా కాన్వెంట్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకున్నారు. సిద్ధార్థ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై, కిరణ్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు.
పులివెందులలో మనుషులను చంపి, అనేక హత్యలు చేసి, ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేసి, రిగ్గింగ్ చేస్తూ వైయస్ కుటుంబం గెలిచిందే తప్ప ప్రజాభిమానంతోనూ, నైతికంగానూ ఏనాడు విజయం సాధించలేదని ఆయన అన్నారు. టెక్నాలజీని తెలుగుదేశం పార్టీ దేశాభివృద్ధికి ఉపయోగిస్తే ఈ కాంగ్రెస్ దొంగలు దోచుకోవటానికి, అవినీతి, అక్రమాలకు ఉపయోగిస్తున్నారు. కాంగ్రెస్ ఓ తప్పుడు పార్టీ అని, ఇంట్లో కూర్చుని సభ్యత్వాలు చేర్చుకుని, నోట్లతో ఓట్లను కొని సహకార సంఘాల ఎన్నికలను అపహాస్యం చేసిందని విమర్శించారు.
రైతులంతా ఓట్లేశారని లిక్కర్ డాన్ బొత్స అంటున్నారని, ముఖ్యమంత్రి చంకలు గుద్దుకుంటున్నారని, రిగ్గింగ్ చేయటం ద్వారా పోలీసులతో ఇబ్బందుల సృష్టించడం ద్వారానే గెలిచారన్నది వారిద్దరూ తెలుసుకోవాలని ఆయన అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ వెంట ఎలా కలిసి వచ్చారో అంతే స్వచ్ఛందంగా తనతోనూ కలిసి రావాలని ఆకాంక్షించారు.
యాత్రలో భాగంగా, విజయవాడ ఆటోనగర్‌కు సంబంధించి ఆటోమొబైల్, రవాణా రంగ ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖిలో పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే, ప్రత్యేకంగా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తానని, జిల్లాకి ఓ డ్రైవింగ్ స్కూల్‌ను పెడతానని, రవాణా రంగానికి స్పెషల్ సెజ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తానని, ఆటోమొబైల్ వారికి జీరో వడ్డీపై స్వయం ఉపాధికి రుణాలు ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. విజయవాడ - గుంటూరు నగరాలను జంటనగరాలుగా అభివృద్ధి చేసి, ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్ట్ చేస్తానని చెప్పారు. ఈ రెండు నగరాలను కలిపి మెగాసిటీ చేసి ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలుపుతామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications