హైదరాబాద్, నీళ్లే: తెలంగాణపై అధిష్టానంతో సిఎం

రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు వాయలార్ రవి, సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్‌లతో సమావేశమయ్యారు. సోనియాతో భేటీ పొడగింపు వల్ల ఆయన ఆంటోనీ కలవలేకపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు తెలంగాణ ప్రాదేశిక మండలి ఏర్పాటు ప్రత్యామ్నాయాలను తమ వద్ద ఉంచుకున్న కాంగ్రెసు అధిష్టానం పెద్దలు ముఖ్యమంత్రితో తాము ఏం చేయబోతున్నామనే విషయాన్ని మాత్రం స్పష్టం చెప్పారు.
ఏం చేసినా త్వరగా చేయాలని, నాన్చుతూ పోతే పార్టీకి రాష్ట్రంలో నష్టం జరుగుతుందని, నిర్ణయం తీసుకోవడానికి ముందు తనకు కాస్తా ముందుగా తెలియజేయాలని ముఖ్యమంత్రి అధిష్టానం పెద్దలతో చెప్పినట్లు సమాచారం. కృష్ణా, గోదావరి నదీ జలాలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ఎలా పంచాలనేది తెలంగాణపై నిర్ణయం తీసుకునే విషయంలో కీలకంగా మారుతుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
హైదరాబాదు మరో కీలకాంశమని ఆయన చెప్పారు. కొన్నేళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచితే ఫరవాలేదని, హైదరాబాదు రాజధానిగా మాత్రమే తమకు తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి నాయకులతో పాటు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కూడా అదే డిమాండ్ ముందు పెడుతున్నారు. అయితే, హైదరాబాదు లేని తెలంగాణ ఇస్తే తమకు అభ్యంతరం లేదని రాయపాటి సాంబశివ రావు వంటి సీమాంధ్ర నాయకులు అంటున్నారు.
తెలంగాణ అంశంపై గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కె. రోశయ్యను కూడా కాంగ్రెసు అధిష్టానం సంప్రదించింది. త్వరలో గవర్నర్ నరసింహన్‌తో, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కూడా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. వీరితో సంప్రదింపులు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని మూడు ప్రాంతాల పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. ఈ సమావేశం బహుశా ఈ నెల 20వ తేదీన జరగవచ్చు.












Click it and Unblock the Notifications