ఇద్దరు కళంకితులు: అఖిలేష్ మంత్రి వర్గంలో కిడ్నాపర్!

తాజా మంత్రివర్గంలోకి వినోద్ కుమార్ సింగ్‌ను అఖిలేష్ తీసుకున్నారు. వినోద్ పైన కిడ్నాప్ ఆరోపణలు ఉన్నాయి. ఓ వైద్యాధికారిని అపహరించిన కేసు ఈయనపై ఉంది. పశువుల అక్రమ తరలింపు కేసులో నిందితుడైన కెసి పాండేకు కూడా చోటు దక్కింది. కాగా అఖిలేష్ మంత్రివర్గంలో కళంకిత మంత్రులు ఉన్నారనే ఆరోపణలు తొలి నుండి వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఇద్దరు కళంకితులను తీసుకోవడం ద్వారా విమర్శలకు మరోసారి ఆస్కారమిచ్చారు.
కాగా సచ్ఛరిత్రులకు తన మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానని ప్రకటించిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో సగానికి పైగా మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నారనే వార్తలు గతంలోనే వచ్చాయి. అఖిలేష్ మంత్రివర్గంలో దాదాపు 54 శాతం మందిపై కేసులున్నాయి. అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్‌లపై అధ్యయనం చేసిన ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఎడిఆర్), జాతీయ ఎన్నికల నిఘా(న్యూ)లు రెండు నెలల క్రితం వివరాలు వెల్లడించాయి.
అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో 48 మంది మంత్రులు ఉండగా.. అందులో 26మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆ నివేదికలు తెలియజేశాయి. వీరిలో కొందరిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం తదితర తీవ్ర అభియోగాల పైనా కేసులున్నాయని నివేదిక తెలిపింది. ఈ నివేదికకను ఎడిఆర్ వ్యవస్థాపకులు త్రిలోచన్ శాస్త్రి, న్యూ రాష్ట్ర కన్వీనర్ సంజయ్ సింగ్‌లు విడుదల చేశారు. 26 మంది మంత్రుల్లో తొమ్మిది మందిపై రేప్, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, కేసులు ఉన్నాయని తెలిపారు.
అమ్రోహా ఎమ్మెల్యే, టెక్స్‌టైల్ మంత్రి మహబూబ్ అలీ పైన 15 కేసులు ఉన్నాయి. హత్యాయత్నం, కిడ్నాప్, రాబరీ కేసులు కూడా ఇతనిపై ఉన్నాయని తెలిపారు. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా పైన ఎనిమిది కేసులు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అరవింద్ సింగ్ గోప్ పైన మూడు కేసులు ఉన్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications