దోస్తీ కుదిరిందా?: ముందు సీట్లో సిఎం, వెనక కోమటిరెడ్డి

ముఖ్యమంత్రిపై ఒంటికాలిపై లేచే కోమటిరెడ్డి వెంకట రెడ్డి సిఎం కాన్వాయ్‌లో కనిపించడం గమనార్హం. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు అయన మృతి తర్వాత అప్పుడప్పుడు సొంత పార్టీ పైన నిప్పులు చెరుగుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనను ప్రత్యేకంగా టార్గెట్‌గా చేసుకొని ధ్వజమెత్తిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వైయస్ పైన అభిమానంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు కోమటిరెడ్డి సోదరులు వెళతారనే ప్రచారం జోరుగా సాగింది.
అందుకు అనుగుణంగానే కోమటిరెడ్డి కిరణ్ పైన నిప్పులు చెరుగుతూ.. జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతుండే వారు. ఆ తర్వాత తెలంగాణ కోసమంటూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసమే రాజీనామా చేశానని ఆయన, జగన్ పార్టీలోకి వెళ్లేందుకు రాజీనామా చేశారని ఆయన ప్రత్యర్థులు విమర్శించేవారు. ఆ తర్వాత అఖిల పక్ష సమావేశంలో జగన్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో కోమటిరెడ్డి తెరాస వైపు తిరిగినట్లుగా కనిపించారు.
అఖిల పక్ష సమావేశం తర్వాత జగన్ పార్టీ ప్రచారం కనుమరుగై తెరాసలో చేరుతారనే ప్రచారం సాగింది. వారు కూడా అందుకు అనుగుణంగానే ప్రకటనలు చేశారు. అయితే ఇటు జగన్ వైపుకు వెళ్లకుండా, తెరాస వైపుకు వెళ్లకుండా ఇప్పుడు కిరణ్ అంటేనే ఒంటికాలిపై లేచే కోమటిరెడ్డి ఆయన కాన్వాయ్‌లోనే వెళ్లడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి అంటే విరుచుకుపడే ఎంపీలలో గుత్తా ఒకరు. ఆయన కూడా వెంట ఉండటం మరో విశేషం.












Click it and Unblock the Notifications