హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఆత్మహత్యలు: బాధ్యులెవరు, కారణాలేమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Suicide
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే పెట్టిన గడువును తానే ఉల్లంఘించిన తర్వాత తెలంగాణలో యువకుల ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయి. తాజాగా, దుబాయ్‌లోని ఓ తెలంగాణ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. డిసెంబర్ 28వ తేదీ తర్వాత కనీసం డజనుకు పైగానే ఆత్మహత్యలు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరనే చర్చ ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉన్నది. అయితే, ఆ చర్చ తెలంగాణ, సీమాంధ్ర నాయకుల మధ్య విమర్శలకు, ప్రతివిమర్శలకు మాత్రమే పరిమితవుతోంది.

ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ కోసం పోరాటం చేసి లక్ష్యాన్ని సాధిద్దామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌తో పాటు అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు యువతకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. అయినా, అవి ఆగడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తెలంగాణ వస్తే యువకులందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టడం వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి సీమాంధ్ర నాయకులు అంటున్నారు. కెసిఆర్ యువతకు ఎక్కడలేని ఆశలు కల్పించడం వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయనేది వారి ఉద్దేశం.

లగడపాటి రాజగోపాల్ వంటి సీమాంధ్ర నాయకుల వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించారని, అలా వచ్చిన తెలంగాణను సీమాంధ్ర నాయకులు అడ్డుకున్నప్పటి నుంచే తెలంగాణలో ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని, తెలంగాణను సీమాంధ్ర నాయకులు అడ్డుకుంటున్నందు వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని వారంటున్నారు.

తెలంగాణపై నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండడం వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఆత్మహత్యలు ఆగాలంటే కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడం తప్ప మరో మార్గం లేదని కోదండరామ్ అంటున్నారు. ఇటీవల ఆయన గవర్నర్ నరసింహన్‌తో కూడా ఇదే విషయం చెప్పారు. అయితే, తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత ఎవరు వహించాలనే ప్రశ్న వచ్చినప్పుడు కేంద్రం బాధ్యత వహించక తప్పదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

కాగా, తెలంగాణ విద్యార్థులు తీవ్రమైన నిరాశానిస్పృహలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. తమ మరణంతోనైనా తెలంగాణ వస్తుందనే ఆశను వారు తమ సూసైడ్ నోట్స్‌లో అంటున్నారు. తమలాగా ఎవరూ చనిపోవద్దని రాస్తూనే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ విషాద భారతానికి అంత మాట అలా ఉంచి, అసలు కారణమేమిటనే విషయాన్ని పెద్దగా విశ్లేషించినట్లు లేదు.

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విఫలమైన వెంటనే ఆ ఉద్యమంలో పెద్ద యెత్తున పాల్గొన్న తెలంగాణ యువకులు విప్లవోద్యమంలోకి వెళ్లిపోయారు. సాయుధ పోరాటం ద్వారా సమాజాన్ని సమూలంగా మార్చేస్తామని విశ్వసించి వారు అడవుల దారి పట్టారు. తమ నిరసనను ఆ రకంగా వ్యక్తం చేయడానికి వారికి అదే సరైన దారిగా కనిపించి ఉండవచ్చు. అలా సాగిన విప్లవోద్యమం ఏం సాధించిందనే ప్రశ్నను పక్కన పెడితే, ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలోని విద్యార్థులకు ఇప్పుడు ఆ ఉద్యమం విశ్వాసాన్ని కల్పించడం లేదా, దాని పాత్ర ముగిసిపోయిందా అనేది ప్రశ్న. తమ నిరసనను వ్యక్తం చేయడానికి మాత్రమే యువత ఆత్మహత్యల మార్గాన్ని ఎంచుకుంటుందనేది ఓ విశ్లేషణ.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నడిపిస్తున్న సీట్లు, ఓట్ల రాజకీయం కూడా తెలంగాణ యువతకు రాష్ట్రాన్ని సాధించి పెడుతుందనే నమ్మకాన్ని కలిగించలేకపోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల నుంచి ఎన్నికల దాకా సాగిస్తున్న తెరాస ప్రయాణంలో, దాని అధినేత కెసిఆర్ వ్యూహాల్లో తెలంగాణ యువత సతమతమవుతోంది. సీమాంధ్ర నాయకులు ఎదుర్కోవడానికి తగిన రాజకీయాస్త్రాన్ని తెరాస అందించలేకపోతోందని భావించవచ్చునని అంటున్నారు.

ఇదిలావుంటే, తెలంగాణ ప్రజా సంఘాల కూర్పు అయిన తెలంగాణ జెఎసి కూడా యువతకు సరైన వేదికగా కనిపించడం లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తెరాసకు మించిన ప్రత్యామ్నాయాన్ని తెలంగాణ జెఎసి ఇవ్వలేకపోతుందనే అభిప్రాయం ఉంది. తెరాస రాజకీయ ప్రయోజనాలకు అది సాధనంగా మారిందని, దానికి పరిమితులు ఏర్పడ్డాయని, ఆ పరిమితులను మించి అది పనిచేయలేని అనివార్యతలో పడిపోయిందని అంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు ఒకే వేదిక మీదికి రాలేకపోతున్నారు. అలా రాకపోవడానికి ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి ఉండడమే కారణం. పార్టీలను, ఎజెండాలను పక్కన పెట్టి ఒకే వేదిక మీదికి రావాలని అన్ని పార్టీల నాయకులు అంటున్నా తమ తమ పార్టీ ప్రయోజానాలకే ఆచరణలో వాళ్లు ప్రాముఖ్యం ఇస్తున్నారు. తమ పార్టీలో చేరితేనే తెలంగాణ కోసం ఐక్యంగా ఉద్యమించడానికి వీలవుతుందనే పద్ధతిలో తెరాస వ్యవహరిస్తోంది.

రాజకీయ పార్టీ అయిన తెరాసలో చేరడానికి ఇతర పార్టీలకు రాజకీయ ప్రాముఖ్యమే అడ్డుగా ఉంటోంది. దీంతో తెలంగాణ నాయకుల మధ్య ఐక్యత సాధ్యం కావడం లేదు. ఈ విషయాలన్నీ సగం అర్థమై, సగం అర్థం కాక, తమ ఆశలు వమ్ము అవుతున్నాయనే నిరాశానిస్పృహలు తెలంగాణ యువతలో విస్తరిస్తున్నాయి. ఈ స్థితిలోనే ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. బలమైన ఉద్యమాలు తెలంగాణలో లేకపోవడం వల్ల కూడా ఉద్యమాల స్వరూప స్వభావాలు ప్రస్తుత తరానికి అనుభవంలోకి రాలేదు. ఇది తెలంగాణకు సంబంధించి ఓ సంధి దశ అని చెప్పవచ్చు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపాల్సింది పాలక పార్టీలే. ఆ పాలకపార్టీలే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాంగ్రెసు అధిష్టానం, కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం మాత్రమే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

English summary
The suicides in telangana are continuing with tha lack of political will to solve the issue. No political party, including Telangana Rastra Samithi (TRS), is not in a position give confidence to Telangana youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X