వెంకన్నతో పెట్టుకోవద్దని వైయస్‌తో చెప్పా: చంద్రబాబు

హైదరాబాద్‌లో ఎనిమిది వేల ఎకరాల భూమిని 53 కంపెనీలకు ఇచ్చి వాటి నుంచి ముడుపులు పొందాడని, వాటిని దొంగ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించాడని, ఓబులాపురంలో ముడి ఖనిజ సంపదనంతా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి అప్పగించాడని ఆయన అన్నారు. తిరుమల వెంకన్నతో పెట్టుకోవద్దని నాడే వైయస్ హెచ్చరించానని గుర్తుచేశారు.
గుంటూరు పట్టణం రింగురోడ్డులోని సిద్ధార్థ గార్డెన్స్ నుంచి సోమవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. నాడు వైయస్, నేడు కిరణ్ ఒకే తప్పు చేస్తున్నారని ఆయన అన్నారు. "తిరుపతి కొండల్లో విశాలమైన భూమి ఉండటంతో నేను ఆనాడు ఎర్రచందనం మొక్కలు నాటించాను. కాంగ్రెస్ దొంగలు ఆ ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. స్మగ్లర్లకు సీఎం కిరణ్ కొమ్ము కాస్తున్నారు" ఆయన అన్నారు.
"తిరుపతి వెంకటేశ్వరస్వామికి అపకారం చేస్తే వాళ్ల భరతం పట్టే పని ఆయనే చూసుకొంటారు. అసెంబ్లీ సాక్షిగా నేను వైయస్‌కు కూడా చెప్పారు. ఎవరి జోలికి పోయినా ఫర్వాలేదు కాని వెంకటేశ్వరస్వామి జోలికి వెళ్ళొద్దన్నాను. ఆయన నా మాట వినలేదు. నేను చిన్నప్పటి నుంచి ఆ వెంకన్న స్వామి పాదాల చెంతన ఉన్నాను. ఆయన పవర్ ఏమిటో నాకు తెలుసు'' అని చంద్రబాబు వివరించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి పుణ్యాన గాలి జనార్దనరెడ్డి మొత్తం ఖనిజాన్ని దోచేశారని, కంచం, మంచం, కుర్చీతో పాటు తాను వినియోగించే వస్తువులన్నింటిని బంగారంతో చేయించుకొని ఆడబిడ్డలు బంగారు తాళిబొట్టులూ కొనలేని పరిస్థితి కల్పించాడని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications