వైఫల్యం లేదు కానీ: చిరు, ఐదులక్షలిచ్చిన రాజశేఖర్
హైదరాబాద్: దేశ అంతర్ఘత నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శుక్రవారం అన్నారు. హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్‌లో పేలుడు సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పేలుడు ఘటనలో భద్రతా వైఫల్యం లేదన్నారు. అయితే, మన నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. పేలుళ్లు పర్యాటక రంగంపై ప్రభావం చూపిస్తాయని చెప్పారు.
రాజశేఖర్ దాతృత్వం
ప్రముఖ సినీ హీరో రాజశేఖర్, ఆయన సతీమణి, నిర్మాత జీవిత రాజశేఖర్ నాంపల్లి కేర్ ఆసుపత్రిలోని క్షతగాత్రులను పరామర్శించారు. మంత్రి డికె అరుణతో కలిసి రాజశేఖర్, జీవితలు నాంపల్లి కేర్ ఆసుపత్రిలో బాధితులను కలిశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షలు ఇచ్చారు.

ముఖ్యమంత్రి వెంటనే వెళ్లారు
పేలుడు విషయం తెలియగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలం చేరుకున్నారని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. పేలుళ్లలో ఎలాంటి భద్రతా వైఫల్యం లేదన్నారు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారని, 15 మృతదేహాలను గుర్తించామని, పద్నాలుగు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామన్నారు. 119 మంది ఈ ఘటనలో గాయపడ్డారని సబితా రెడ్డి చెప్పారు. బాధితుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు.
ఓమ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కేంద్రమంత్రి చిరంజీవి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. అంతకుముందు రాజ్ నాథ్ సింగ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా, అంబరుపేటకు చెందిన మృతుడి కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరామర్శించారు.












Click it and Unblock the Notifications