అఫ్జల్ గురు ఉరితో హైదరాబాద్ పేలుళ్లకు లింక్ లేదా?

గురు ఉరితీతకు ప్రతీకారంగా ఇండియన్ ముజాహిదీన్ దాడులకు ఒడిగట్టవచ్చునని భద్రతా సంస్థలు, నిఘా సంస్థలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అంతకు ముందే హెచ్చరించాయి. హైదరాబాద్ బాంబు పేలుళ్లకు ఇండియన్ ముజాహిదీన్ పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చెప్పింది.
హైదరాబాద్ పేలుళ్లను పరిశీలిస్తే ఇండియన్ ముజాహిదీన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని, చాలా రోజుల క్రితమే పేలుళ్లకు పథకం రచించారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలంటున్నాయి. లష్కరే తోయిబా, జైష్ - ఎ - మొహమ్మద్, హుజి, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్‌లో సమావేశమై కాశ్మీర్‌లోనూ, భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ బహుముఖ దాడులకు పథకాలు రూపొందించాలని అనుకున్నట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తాకథనాన్ని ప్రచురించింది.
ఉగ్రవాద సంస్థల ప్రణాళికలో భాగంగానే హైదరాబాదులో పేలుళ్లు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. పేలుళ్ల పథకాన్ని ఇండియన్ ముజాహిదీన్ అమలు చేసిందని అంటున్నారు.
దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల కేసును దర్యాప్తు చేయడానికి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కేసును సిట్ దర్యాప్తు చేస్తుందని ఆయన చెప్పారు. సాక్ష్యాధారాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు వేగంగా జరుగుతుందని అన్నారు. హైఅలర్ట్ ప్రకటించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications