కోట్లతో ఒరిగిందేమీ లేదు: రైల్వే బడ్జెట్‌పై బాబు అసంతృప్తి

రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రానికి ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా రాలేదని ఆయన అన్నారు. బడ్జెట్‌లో ఎంఎంటిఎస్ ప్రస్తావన లేకపోవడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. ఎన్నికల కోసం పవన్ కుమార్ బన్సల్ కల్లబొల్లి కబుర్లు చెప్పారని వ్యాఖ్యానించారు. ఒక్క డబ్లింగ్ ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి రాలేదని ఆయన అన్నారు. 65 ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రాష్ట్రానికి 8 మాత్రమే కేటాయించారని చెప్పారు.
రాష్ట్రం నుంచి 10 మంది కేంద్ర మంత్రులున్నా ప్రయోజనం ఏమీ లేదని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్రానిిక అన్యాయం జరుగతూనే ఉందని, దీన్ని కాంగ్రెసు నాయకులు కూడా అంగీకరిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మంగళవారంనాడు తన వస్తున్నా... మీకోసం పాదయాత్రను గుంటూరు జిల్లాలో కొనసాగించారు.
రైతులు ఇంటికొకరు బయటకు వచ్చి తాము చేపట్టే మహాధర్నాలో పాల్గొంటే ప్రబుత్వం పంటలకు నీరు ఇచ్చి తీరుతుందని చంద్రబాబు అన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పంటలకు ఒకసారి నీరిస్తే పంట చేతికి వస్తుందని తాను ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. తాను పౌరుషంగా మాట్లాడితే తనపై కేసులు పెడతామని మంత్రులు అంటున్నారని ఆయన గుర్తు చేశారు. మొదట రైతులకు నీరు ఇచ్చిన తర్వాత కేసుల గురించి మాట్లాడాలని ఆయన మంత్రులకు సలహా ఇచ్చారు.
కళ్లెదుట పంటలు ఎండిపోతున్నా ఇంకా రైతుల్లో ప్రభుత్వం పట్ల కసి, కోపం పెరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫి చేస్తామని, వ్యవసాయానికి తాకట్టు పెట్టిన బంగారాన్ని వెనక్కి ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పిల్లలకు విద్య, ఉద్యోగావకాశాల కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తామని, గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications