చంద్రబాబుపై దండెత్తిన కెసిఆర్: ఆంధ్రజ్యోతిపై ఫైర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ముందే వీగిపోయిన అవిశ్వాసమంటూ వార్తాకథనాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రికపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబుపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మేసినా తుడిచేసుకుని పోతానంటే చంద్రబాబు కర్మ అని ఆయన అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాపాడుతున్నది చంద్రబాబు నాయుడేనని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని, ఆ స్ఫూర్తి తెలుగుదేశం పార్టీలో లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు టిడిపి అని పేరు చంద్రబాబు తన పార్టీకి పేరు పెట్టుకుంటే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకూడని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన అన్నారు.

అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఎన్ని ముడుపులు తీసుకున్నారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పి. చిదంబరంతో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. తమది తోక పార్టీ అనే విషయం 2009 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పుడు గుర్తు లేదా అని ఆయన చంద్రబాబును అడిగారు. ప్రస్తుత నిర్ణయంతో చంద్రబాబు వైఖరి ప్రజలకు తేటతెల్లమైందని అన్నారు.

అత్యంత కుసంస్కారంతో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు మాట్లాడేది నిజమే అయితే అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఏమిటో చంద్రబాబు, టిడిపి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం వచ్చినప్పుడు ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే ఏమిటని ఆయన అన్నారు. అందులోని కుట్ర ఏమిటని ఆయన అడిగారు.

అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా చంద్రబాబు చారిత్రక తప్పిదమని ఆయన అన్నారు. మనసు మార్చుకుని తమతో కలిసి రావాలని, లేకుంటే గంగలో కలిసిపోతావని, రక్షించేవారు కూడా ఉండరని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. బయట తొడ కొడతావు, పడగొడదాం రమ్మంటే వెనక్కి పోతావని ఆయన చంద్రబాబును అన్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత నీచమైన నిర్ణయం ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు. తమకు చెప్పలేదని చంద్రబాబు అన్నారని, తాము పార్టీలో తీసుకున్న నిర్ణయాన్ని తాను మీడియా సమావేశంలో చెప్పానని, ఇంకా అవిశ్వాస తీర్మానానికి నోటీసే ఇవ్వలేదని, నోటీసు ఇవ్వడానికి ముందు లేఖలు రాశానని ఆయన అన్నారు. తమకు చెప్పలేదని చంద్రబాబు అనడం కుంటిసాకు మాత్రమేనని, చంద్రబాబు నైజం బయటపడిందని ఆయన అన్నారు.

ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వెనుకంజ వేస్తున్నావు, నువ్వు చేసేవి బూటకపు విమర్శలా, నక్కజిత్తుల వేషాలా అని ఆయన చంద్రబాబును అన్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు తమకు చెప్పకపోయినా బలపరిచామని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం పడిపోదని తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించిన రెండు సార్లు కూడా బలపరిచామని కెసిఆర్ అన్నారు. తాము పెడితే మద్దతు ఇవ్వడానికి పౌరుషం అడ్డం వస్తే చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదించాలని, ఈ సాయంత్రంలోగా ఆ విషయం చెప్పాలని, తాము మద్దతు ఇస్తామని అన్నారు.

వస్తున్నా మీకోసం.. చస్తున్నా మీ కోసం అంటూ చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని, ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా చంద్రబాబును నిలదీయాలని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రావడానికి అవసరమైన బలం తమకు ఉందని ఆయన చెప్పారు. విజయమ్మకు లేఖ రాశామని, మద్దతు ఇస్తారా, లేదా అనేది చెప్పలేదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినా మంచిదేనని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం శానససభలో చర్చకు వస్తుందని ఆయన అన్నారు.

అనైతికంగా, దుర్మార్గంగా, కాంగ్రెసుకు కొమ్ము కాసే విధంగా చంద్రబాబు దిగజారిపోయారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు ఇంటి పేరు మోసం, అసలు పేరు వంచన దగా అని ఆయన అన్నారు. పనిలో పనిగా కెసిఆర్ ఆంధ్రజ్యోతి దినపత్రికపై విరుచుకుపడ్డారు. ముందే వీగిపోయిందంటూ వార్తాకథనం రాసి అత్యుత్సాహం ప్రదర్శించిందని ఆయన ఆంధ్రజ్యోతి దినపత్రికపై వ్యాఖ్యానించారు. అవహేళన చేసే విధంగా ఆంధ్రజ్యోతి వార్తాకథనం ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ పెడితే కూడా అవిశ్వాసం వీగిపోయిందని, సమస్యలు చర్చకు రావడానికి అవిశ్వాసం ప్రతిపాదిస్తారని, సందర్భం అనుకూలిస్తే ప్రభుత్వం పడిపోతుందని ఆయన అన్నారు. ఆపహాస్యం చేసే విధంగా వార్తలు రాసే విషయంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆలోచించుకోవాలని ఆయన అన్నారు.

తాను మాట మీద నిలబడుతానని ఆయన చెప్పారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని చెప్పానని, దానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. తెలంగాణ వస్తున్నప్పుడు ఏ త్యాగానికైనా సిద్ధపడుతామని ఆనయ చెప్పారు. తెలంగాణపై రాజీనామాలు చేస్తామని చెప్పి పారిపోయిన చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+