తెలంగాణనే వైయస్ జగన్ పార్టీని వెనక్కి లాగిందా?

తెలుగుదేశం పార్టీని రంగంలోకి దించడానికి తెరాసతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను ముందుకు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తోయించారనే అభిప్రాయం కూడా ఉంది. తాము ప్రతిపాదిస్తే లాలూచీ పడడానికి ప్రతిపాదిస్తున్నారు కాబట్టి మద్దతు ఇవ్వబోమని తెలుగుదేశం పార్టీ చెప్పే అవకాశం ఉందని ముందే గ్రహించి అలా చేయించినట్లు చెబుతున్నారు. అయితే, తెరాస ప్రతిపాదించే తీర్మానానికి కూడా మద్దతు ఇవ్వబోమని తెలుగుదేశం పార్టీ ప్రకటించడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు.
తెరాస ప్రతిపాదించే తీర్మానానికి మద్దతు ఇవ్వడం ద్వారా తమను తాము చిన్న పార్టీగా చూపించుకోవడంతో పాటు తెలంగాణకు మద్దతు ఇస్తున్నట్లు సంకేతాలు వెళ్తాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావించినట్లు చెబుతున్నారు. తెరాస ప్రధానంగా తెలంగాణ అంశంపైనే పట్టు బడుతోంది. తెలంగాణ అంశంపై శానససభా సమావేశాలను స్తంభింపజేస్తామని కూడా చెప్పింది. అందువల్ల తెలంగాణను ప్రధానం చేసుకునే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం వల్ల తమకు సీమాంధ్ర ప్రాంతంలో నష్టం జరుగుతుందని ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. దాంతో ప్రజాసమస్యలను మాత్రమే ప్రస్తావిస్తూ అవిశ్వాస తీర్మానానికి విడిగా నోటీసు ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
చంద్రబాబుపై మండిపాటు
తమ అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయంపై వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు మండిపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేయడాన్ని కూడా తప్పు పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు ముమ్మాటికీ తోకపార్టీ అని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెసును కాపాడే రక్షణ కవచంగా టిడిపి మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన ప్రధాన ప్రతిపక్షం శానససభ్యులకు విప్ జారీ చేయడం వింతగా ఉందని ఆయన అన్నారు. ఈ వింతతకు స్పూర్తికర్త చంద్రబాబు చరిత్రలో నిలుస్తారని ఆయన అన్నారు.
అవిశ్వాసంపై విప్ జారీ చేసి టిడిపి శాసనసభ్యులను కట్టడి చేయడం సిగ్గుచేటని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభా పక్షం ఉప నేత ధర్మాన కృష్ణదాస్ చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పటికైనా అవిశ్వాస తీర్మానంపై పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ వైఖరితో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు గుంటూరులో విమర్శించారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ఎందుకు జంకుతున్నారని ఆయన చంద్రబాబును అడిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని బహిరంగంగా ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు తెర వెనుక కాంగ్రెసుతో లాలూచీ పడ్డారని ఆయన ఆరోపించారు.
శాసనసభ వేదికగా ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన విపక్ష నేత అధికార పక్షంతో కుమ్మక్కయిపోయి నీచరాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అవిశ్వాసం నుంచి ప్రభుత్వం బయటపడేలా చంద్రబాబు చూస్తున్నారని ఆయన అన్నారు. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications