బాధగానే ఉంది కానీ: సభలో వైయస్ విజయమ్మ స్పీచ్..

కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కయ్యాయన్నారు. కాంగ్రెసు హయాంలో తీవ్రమైన కరెంటు కోతలు ఉన్నాయన్నారు. వీటితో కార్మికుల బ్రతుకు దుర్భలమవుతోందన్నారు. కరెంటు సమస్యలు ఉన్నా ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. వైయస్ హయాంలో కరెంట్ ఛార్జీలు పెరుగలేదని కానీ, ఇప్పుడు మాత్రం భారీగా పెంచుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా స్తంభించిపోయిందన్నారు.
వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కొనసాగటం లేదన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. సర్ ఛార్జీల పేరుతో భారీగా వసూలు చేస్తూ కరెంట్ మాత్రం ఇవ్వడం లేదన్నారు. బొగ్గు, గ్యాస్ లేదంటున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదన్నారు. బొగ్గు దిగుమతిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదన్నారు. ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం వల్లనే రాష్ట్రం అంధకారంలో మునిగిపోయిందన్నారు.
గ్యాస్ సరఫరాలో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులపై మోయలేని భారం పడుతోందన్నారు. విద్యుత్ కోతలతో పరిశ్రమలు మూత పడుతున్నాయన్నారు. 104, 108లు సరిగా నడవడం లేదన్నారు. మూడున్నరేళ్ల క్రితం అన్నదాతగా ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు అన్నమో రామచంద్ర అనే రాష్ట్రంగా మార్చివేశారని విమర్శించారు.
ఉగ్రవాదంపై చర్యలేవి?
ఇటీవల దిల్‌సుఖ్ నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ... ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారని, కేంద్రం హెచ్చరికలు జారీ చేసినా ఎందుకు అప్రమత్తం కాలేదని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదన్నారు. రాష్ట్రం రెండు రకాల విపత్తులను ఎదుర్కొంటుందని, ప్రకృతి ఓ కారణమైతే, నాయకులు మరో కారణమని ఆమె అన్నారు. అకాల వర్షాలతో రైతులు భారీగా నష్టపోయినా సకాలంలో స్పందించలేదన్నారు.
ప్రభుత్వం వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలను నిర్వీర్యం చేస్తోందన్నప్పుడు మంత్రి దానం నాగేందర్ అన్ని పథకాలు కొనసాగుతున్నాయని వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications