కర్నూల్ వేపై హైటెన్షన్: ఎమ్మెల్యేలు అరెస్ట్, కిరణ్ ఆరా

ఆలంపూర్ వద్ద ఉద్రిక్తత, రాళ్ల దాడి
ఆలంపూర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలంపూర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణా రావును అరెస్టు చేశారు. దీంతో రెచ్చిపోయిన తెలంగాణవాదులు వాహనాలపై రాళ్ల దాడి చేశారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను అక్కడి నుండి పంపించి వేశారు.
ఆలంపూర్ వద్ద సడక్ బంద్ నిర్వహిస్తున్న తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, ఉద్యోగ జెఏసి నేత శ్రీనివాస్ గౌడ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కొత్తకోట మండలం పాలెంలో పాలమూరు విశ్వవిద్యాలయ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
కొత్తకోటలో..
కొత్తకోటలో సడక్ బంద్ చేపట్టిన ఎమ్మెల్యేలు భిక్షపతి యాదవ్, రాజయ్య, సమ్మయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. షాద్ నగర్ వద్ద సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావును అరెస్టు చేశారు. వారిని కర్నూలు పోలీసు స్టేషన్‌కు తరలించారు.
శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమను ప్రభుత్వం దౌర్జన్యంగా అరెస్టు చేయడం దారుణమని ఈటెల రాజేందర్ అన్నారు. దీనికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించికుంటుందన్నారు. ఎంత అణచాలనుకున్నా తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమవుతుందన్నారు. కేసుల వంటి తాటాకు చప్పుళ్లకు తాము భయపడే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పి మాట తప్పిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.
పాలమాకులలో హరీష్ హవా
శంషాబాద్ సమీపంలోని పాలమాకులలో సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు రోడ్డుపై బైఠాయించారు. భారీగా తెలంగాణవాదులను సమీకరించిన ఆయన టెంట్లు వేసుకొని ఆందోళనకు దిగారు. ధూం ధాం కార్యక్రమం నడుస్తోంది. తెలంగాణ జెఏసి ఏడు పాయింట్ల వద్ద సడక్ బంద్ నిర్వహించనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. హరీష్ రావు ఇంద్రా రెడ్డి విగ్రహానికి పూల మాల వేశారు.
కిరణ్ ఆరా
సడక్ బంద్ కార్యక్రమం పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఇతర పోలీసులు అధికారుల నుండి ఆరా తీశారు.












Click it and Unblock the Notifications