వైయస్ కోరితే కెవిపి పిల్లలకు సీటిప్పించిన టిడిపి నేత!

ఇప్పుడు కోటీశ్వరుల జాబితాలో ఉన్నాడని అందరూ చెప్పుకొంటున్న కెవిపి 2004కు ముందు కొడుకుల కాలేజీ ఫీజులకు డబ్బులు లేని స్థితిలో ఉన్నారని గాలి ముద్దుకృష్ణమ చెప్పారు. కెవిపి తన పెద్ద కొడుకును ఇంజనీరింగ్, చిన్న కొడుకును ఎంసిఏలో చేర్పించాలని అనుకున్నారని, అప్పుడు తాను కాంగ్రెస్‌లో ఉన్నానని, తాను చెబితే మద్రాసు ఆర్ఎంకె కాలేజిలో డొనేషన్ లేకుండా సీటు ఇస్తారని ఎవరో చెబితే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనను పిలిచి ఎలాగైనా కెవిపి పిల్లలకు సీట్లు ఇప్పించాలని కోరారని చెప్పారు.
ఆ రెండు సీట్లకు ఆ రోజుల్లో రూ.10 లక్షలు డొనేషన్ అని, ఫీజు లక్షన్నర అని, తాను డొనేషన్ కట్టలేనని కెవిపి చెబితే, ఆ కళాశాల యాజమాన్యంతో తాను మాట్లాడి ఫీజు మాత్రం తీసుకొనేలా ఒప్పించానని చెప్పారు. ఆ ఫీజు డబ్బులు కూడా కెవిపి వద్ద లేవని, వైయస్ తనకు తెలిసిన వారికి ఫోన్లు చేశారని, రైలు బయల్దేరే సమయానికి డబ్బులు అందితే తాము హడావుడిగా చివరి నిమిషంలో వెళ్లామన్నారు.
తిరిగి వచ్చిన తర్వాత వైయస్ తనను కౌగిలించుకున్నారని, సీట్లకు పది లక్షలు కట్టగలిగే పరిస్థితిలో తాము లేమని.. చాలా పెద్ద సాయం చేశానని మెచ్చుకున్నారన్నారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కెవిపి తీరే మారిపోయిందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకు తనకు చిన్న పని ఉండి కెవిపి ఇంటికి వెళ్లానని, పేరు రాసి పంపిస్తే రెండు గంటల వరకూ తనను పిలవలేదని.. ఆ దెబ్బతో తాను మళ్లీ కెవిపి గడప తొక్కలేదని, అదే ఆఖరని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications