వల్లభనేని వంశీకి బాబు ఓకే: గన్నవరం నుండి పోటీ!

దాదాపు ఏడాది క్రితం విజయవాడలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వల్లభనేని వంశీ ఆలింగనం చేసుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తీవ్ర దుమారం రేగడంతో వంశీ దానిపై పార్టీ అధ్యక్షుడికి లేఖ రూపంలో వివరణ ఇచ్చారు. వంశీ ఆలింగనం తర్వాత గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వల్లభనేని వంశీ, కొడాలి నానిలు హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితులు.
ఈ నేపథ్యంలో నాని దారిలోనే వంశీ వెళ్లవచ్చుననే ప్రచారం జరిగింది. వంశీ మాత్రం దానిని కొట్టి పారేశారు. కొడాలి నాని పార్టీకి దూరం కావడంతో పలువురిలో ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. అయితే, చంద్రబాబు ఈ రోజు వంశీతో పాటు పలువురికి నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. వల్లభనేని వంశీప పైన పూర్తిగా నమ్మకం కుదిరాకే ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించి ఉంటారంటున్నారు.
వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నడకతో పాటు ఆయా నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నారు. ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల చిట్టా ఆయన వద్ద ఉందట. మూడు రోజుల క్రితం రాజమండ్రి, అమలాపురంలకు మురళీ మోహన్, గొల్లపల్లి సూర్యారావులను ఇంఛార్జులుగా నియమించారు. వారే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
తాజాగా కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాల బాధ్యతలను బాబు నేతలకు అప్పగించారు. విజయవాడ పార్లమెంటు స్థానం బాధ్యతలు కేశినేని నానికి, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు వల్లభనేని వంశీకి, విజయవాడ పశ్చిమ బుద్దా వెంకన్నకు, విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావుకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వీరే ఆ నియోజకవర్గాల నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలు అప్పగించిన బాబు మీ మీ నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళ్లి పని చేసుకోవాలని, పార్టీ సంస్థాగత పటిష్టత పైన దృష్టి సారించాలని సూచించారు.












Click it and Unblock the Notifications