వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు ఝలక్: కాంగ్రెసు తెలంగాణ నేతలు దూరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayasanthi - K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కాంగ్రెసు తెలంగాణ నేతలు దూరమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెరాసకు దీటుగా దీటుగా ఉద్యమంలో ముందు వరుసలో ఉండాలని ప్రయత్నాలు చేస్తూ, పార్టీతో కలిసి పనిచేయడానికి కూడా వెనుకాడని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. తెలంగాణ జెఎసి నిర్వహించే ఆందోళనా కార్యక్రమాల్లో తమ ఉనికిని చాటుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ, ఈసారి సడక్ బంద్‌కు వారు దూరంగా ఉన్నారు.

పార్లమెంటులో తెలంగాణ అంశాన్ని తెరాస పార్లమెంటు సభ్యులు కెసిఆర్, విజయశాంతి ఆందోళనకు దిగినప్పుడు కూడా కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు దూరంగా ఉన్నారు. ముందుగానే కెసిఆర్ వారికి చెప్పినా వారు పట్టించుకోలేదు. గతంలో పార్లమెంటులో కెసిఆర్‌తో పాటు వారు కూడా గొంతులు కలిపారు. ఆందోళనలకు దిగారు. కానీ, వారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఊసు కూడా ఎత్తడం లేదు.

సడక్ బంద్ సందర్భంగా జరిగిన ఓ ఘటనకు సంబంధించి తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్, తెరాస శాసనసభ్యులు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, కావేటి సమయ్య అరెస్టుపై కూడా చాలా మంది మౌనంగానే ఉండిపోయారు. సీనియర్ నేత కె. కేశవరావు మాత్రం పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం, రాజయ్యలను తీసుకుని మహబూబ్‌నగర్ జైలుకు వెళ్లి పరామర్శించారు. మందా జగన్నాథం, రాజయ్య తెరాసలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా ఉంది. మిగతా పార్లమెంటు సభ్యులు మాత్రం పట్టించుకోలేదు.

తెలంగాణకు చెందిన మంత్రులు, కాంగ్రెసు శానససభ్యులు మొక్కుబడిగా సడక్ బంద్‌కు అనుమతి ఇవ్వాలని కోరడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఆయన అందుకు నిరాకరించడంతో మౌనంగా ఉండిపోయారు. సాగర హారం సందర్భంగా తెలంగాణ మంత్రులు హడావిడి చేసి అనుమతి ఇప్పించారు. ప్రభుత్వం వ్యవహరించే తీరు ముందే తెలియడం వల్ల కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సడక్ బంద్‌కు దూరంగా ఉన్నారా, తమ ఆందోళన వల్ల కూడా తెరాసనే బలపడుతుందనే ఉద్దేశంతో అలా వ్యవహరించారా, అధిష్టానం వారికి కచ్చితమైన ఆదేశాలు ఇచ్చిందా తెలియదు.

తాము టార్గెట్ కావడం వల్లనేనా..

సడక్ బంద్‌కు తెలంగాణ జెఎసి తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలను ఆహ్వానించలేదు. అయితే, అరెస్టులపై శాసనసభలో జరిగిన చర్చలో మాత్రం అరెస్టులను ఖండించి, కాంగ్రెసుపై పైచేయి సాధించింది. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో కాస్తా అనుకూల వైఖరిని వెల్లడించింది. అప్పటి నుంచి కాంగ్రెసు తెలంగాణ విషయంలో లక్ష్యంగా మారుతూ వచ్చింది. తెరాస నాయకులు, కెసిఆర్ కూడా కాంగ్రెసును లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు.

ఆ అఖిల పక్ష సమావేశానికి ముందు కెసిఆర్ పూర్తిగా తెలుగుదేశం పార్టీని, ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీని లక్ష్యం చేసుకున్నారు. అఖిల పక్ష సమావేశానంతరం ఈ రెండు పార్టీలకు ఊరట లభించింది. సిపిఐ, బిజెపి వంటి రాజకీయ పార్టీలు కూడా కాంగ్రెసునే తెలంగాణ విషయంలో లక్ష్యం చేసుకున్నాయి. దీంతో కాంగ్రెసు తెలంగాణ నేతలు తాము లక్ష్యంగా మారామనే ఉద్దేశంతో ప్రజల ముందుకు వెళ్లడానికి వెనకాడుతున్నారా అనేది కూడా చెప్పలేని స్థితి.

తెలంగాణకు వ్యతిరేకంగా సంకేతాలు..

కాంగ్రెసు అధిష్టానం నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా సంకేతాలు ఎప్పటికప్పుడు అందుతున్నాయి. ఈ స్థితిలో ప్రజల ముందుకు వెళ్లడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు జంకుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటలు, చేతలు కూడా తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా నెట్టుకొస్తామనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

తెలంగాణలో తనకంటూ ఓ వర్గాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్నారు. ఆ వర్గంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగానే తన కార్యకలాపాలను సాగిస్తున్నారనే మాట వినిపిస్తోంది. పైగా, తెలంగాణలో తెరాసకు, తెలంగాణ జెఎసికి ప్రజల నుంచి అంతగా మద్దతు లభించడం లేదనే సంకేతాలను కూడా కాంగ్రెసు రాష్ట్ర నేతలు కొందరు పార్టీ అందిస్తున్నట్లు సమాచారం. ఈ స్థితిలో కెసిఆర్‌కు కాంగ్రెసు తెలంగాణ నేతల నుంచి మద్దతు లభించడం లేదనే మాట వినిపిస్తోంది.

తాజా పరిణామాలను బట్టి చూస్తే, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జానారెడ్డి, తదితరులు కొత్త రాజకీయ వేదికను తెలంగాణ కోసం తీసుకుని వస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనివల్ల కూడా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నేతలు కెసిఆర్‌కు, కోదండరామ్‌కు దూరంగా ఉండడానికి నిర్ణయించుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఏమైనా, ఇది కెసిఆర్‌కు పరీక్షా సమయమే.

English summary

 Congress Telangana region MPs are maintaining distance from Telangana Rastra Samithi (TRS) president K chandrasekhar Rao in Telangana stir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X