వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగం జనార్ధన్ 'ది అడ్వైజర్': ప్రతిపక్షాలకు ఓ కెవిపి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వాలకు సలహాదారులు ఉంటారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ప్రభుత్వం సలహాదారుగా పని చేశారు. ఆ తర్వాత రోశయ్య హయాంలోను పని చేశారు. కెవిపి పేరు ప్రభుత్వ సలహాదారుగానే దాదాపు అందరికీ తెలిసిందని చెప్పవచ్చు. ప్రభుత్వానికి సలహాదారులు ఉండటం సాధారణమే. ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా ఓ సలహాదారు దొరికారు.

తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, నాగర్‌కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి రూపంలో ప్రతిపక్షాలకు సలహాదారు దొరికారు! అంటే ఆ పార్టీలకు ఆయన సలహాదారు కాదు. కానీ, ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు విపక్షాలకు ఆయన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రతి అంశంలో సర్కారును ఇరుకున పెట్టాలని చూస్తాయి. సర్కారు సమాధానాలతో ప్రతిపక్షాలు ఇరుకున పడిన సమయంలో నాగం విపక్షాలకు సలహాలు ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగం సర్కారును విమర్శించేందుకు ప్రతిపక్షాలకు సలహాలివ్వడమే కాకుండా క్లాస్ కూడా పీకారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఇలా ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలకు ఆయన సూచనలిస్తున్నారు. సోమవారం అసెంబ్లీలో చర్చ సాగుతుండగా వైయస్సార్ కాంగ్రెసుకు సలహా ఇచ్చిన నాగం అంతకుముందు పలుమార్లు బిజెపి, తెరాసలకు సూచనలు చేశారు. నిన్న సభ వాయిదా పడిన అనంతరం నాగం టిడిపి నేతలకు ఏకంగా క్లాస్ తీసుకున్నారు.

విద్యుత్ సమస్యపై చర్చ సాగుతుండగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. వైయస్ హయాంను వెనుకేసుకొస్తూ కాంగ్రెసు ప్రభుత్వాన్ని తప్పు బట్టారు. ఇంతలో మంత్రి డికె అరుణ జోక్యం చేసుకొని శ్రీకాంత్ రెడ్డి సభకు కొత్తవాడని, ఆయనకు తెలియదని చెప్పారు. డికె అరుణ విద్యుత్ విషయంలో కొంత వివరణ ఇచ్చారు. దీంతో జగన్ పార్టీ కొంత ఇబ్బంది పడ్డట్లుగా కనిపించింది. అయితే, అంతలో నాగం వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో... డికె అరుణ కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏ పార్టీలో ఉన్నారో మొదట అడగమని సూచించారు.

సభ అనంతరం టిడిపి నేతలకు క్లాస్ పీకారట. టిడిపి హయాంలో విద్యుత్ సమస్య ఇంత తీవ్రంగా లేదని, చంద్రబాబు పాలన భేష్‌గా ఉందని, తాను కేవలం తెలంగాణ కారణంగానే పార్టీని వీడానని, బాబు పాలన మాత్రం బాగుందని కితాబిచ్చారు. అదే సమయంలో సర్కారును ఇరుకున పెట్టడంలో చతికిల పడ్డారని క్లాస్ పీకారట. బొత్సకు మాట్లాడే అవకాశం ఎందుకిచ్చారని ప్రశ్నించారట. టిడిపి హయాంలో విద్యుత్ ఎలా ఉందో ఎందుకు అడగలేదని ప్రశ్నించారట. 70 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండి సర్కారను ఇరుకున పెట్టలేకపోయారని వారితో అన్నారట.

టిడిపి ప్రభుత్వ హయాంలో రైతులకు విద్యుత్తు సరఫరా సక్రమంగా జరిగిందని, ఈ విషయాన్ని ఆ పార్టీ శాసన సభ్యులు శానససభలో సరిగా చెప్పలేకపోయారని నాగం అన్నారు. ఈ విషయంపై ఆయన టిడిపి శాసనసభ్యులకు క్లాస్ తీసుకున్నారు. తన పాలనలో తెలుగుదేశం పార్టీ విద్యుత్‌రంగాన్ని చాలా బాగా నిర్వహించిందని, కాని సభలో జరిగిన చర్చలో దానిని సరిగ్గా చెప్పుకోలేకపోయిందన్నారు.

"విద్యుత్ రంగంలో టిడిపి చాలా బాగా చేసింది. ఆ రోజు నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా. రైతులు గడియారం చూసుకొని పొలం వెళ్ళే స్థాయిలో కరెంటు ఇచ్చింది. ఎంత కరువు ఉన్నా రైతులకు ఇబ్బంది రానీయలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంతా నాశనం అయింది. టిడిపి ఎమ్మెల్యేలు ఇంకా బాగా దాడి చేసి ఉండాల్సింది.' అని నాగం అన్నారు. కేవలం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ఉద్దేశ్యంలో భాగంగా నాగం ప్రతిపక్షాలన్నింటికి సలహాలిస్తున్నారు. తెరాస, బిజెపిలకు కూడా తన అనుభవాన్ని పంచుతున్నారు.

English summary
Telangana Nagara Samithi leader Nagam Janardhan Reddy has praised the power supply situation in the Telugudesam party president Nara Chandrababu Naidu's administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X