జైళ్లో పెడ్తారా?: మోపిదేవి సోదరుడి నిప్పులు, తోపులాట

ఈ సందర్భంగా మోపిదేవి హరినాథ్ లేచి.. తన సోదరుడు ఏళ్లుగా కాంగ్రెసు పార్టీ కోసం కష్టపడ్డారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు జైలులో ఉంటే ఎవరు స్పందించరా? అని సమావేశంలో నిలదీశారు. నాటి జివోలతో సంబంధమున్న మంత్రులను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తన సోదరుడు ఒక్కడినే ఎందుకు బలి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
జిల్లాలో ఇద్దరు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ జిల్లాకు చెందిన నేత అకారణంగా జైలులో ఉంటే పట్టించుకోరా అని నిలదీశారు. ఆయనను బయటకు తీసుకు వచ్చేందుకు అందరం కలిసి కిరణ్ కుమార్ రెడ్డిని కలవాలని ఆయన సూచించారు. పార్టీలో బిసిల పట్ల చిన్న చూపు కనిపిస్తోందన్నారు.
హరినాథ్ ఆవేదన వ్యక్తం చేస్తుండగా కొందరు నేతలు ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. హరినాథ్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని మోపిదేవి వర్గం ప్రశ్నించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో సమావేశాన్ని వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications