కాబోయే సిఎంకు పూలబాట పరుస్తున్న కిరణ్ కుమార్!

Chiranjeevi - YS Jagan - Chandrababu Naidu
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రికి పూలబాట పరుస్తున్నారనే వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే అదే నిజమని కూడా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన హయాంలో విద్యుత్ బకాయిలు ముక్కుపిండి వసూలు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే తోవలో నడుస్తున్నారంటున్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రం వీరికి భిన్నంగా విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడమే కాకుండా ఉచిత విద్యుత్ ఇచ్చారని అంటున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఇంతటి విద్యుత్ సంక్షోభానికి వైయస్ రాజశేఖర రెడ్డియే ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు, ఉచితం పేరుతో వైయస్ పప్పు బెల్లాల్లా పంచి ప్రజలను 'ఉచితా'నికి అలవాటు పడేలా చేశారని, ప్రజలను మభ్యపెట్టి తన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కోట్లు సంపాదించి పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత విద్యుత్ సంక్షోభం ఇప్పుడు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ ప్రభుత్వం ఓ వైపు విద్యుత్ కోతలు భారీగా విధిస్తూనే మరోవైపు ఛార్జీల పెంపుకు సిద్ధపడింది. ఈ విషయమై కిరణ్ పలు సందర్భాలలో మాట్లాడుతూ.. మొత్తం ప్రభుత్వం భరించడమే కష్టమని, ప్రజలు కూడా కొద్దిగా భరించాలని హితబోధ చేశారు.

అయితే, విపక్షాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుండటంతో కిరణ్ సమీక్షిస్తామని ఇప్పుడు చెబుతున్నారు. ఎంతగా సమీక్షించినా విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కిరణ్ ప్రభుత్వం తీరు పట్ల సొంత పార్టీ నేతలో మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఇలాంటి నిర్ణయాలు పార్టీని ఇబ్బందులకు గురి చేస్తాయని, పార్టీ గెలుపుపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై కిరణ్ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలకు మరో ఏడాది ఉన్నందున విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు కొంత ప్లస్ అవుతుందనే చెప్పవచ్చు. గత ఆరేళ్లుగా రాష్ట్రం ఏడాదికేడాది అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఇప్పుడు కిరణ్ ప్రభుత్వం ఛార్జీల పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాకు కొంత మేర డబ్బులు వస్తాయని, అది 2014 ఎన్నికల అనంతరం వచ్చే ముఖ్యమంత్రికి పూలబాట పర్చినట్లే అవుతుందంటున్నారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై ఇంతలా ఆందోళన చేపడుతున్న విపక్షాలు తాము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని ఎక్కడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాయంటున్నారు. ఒకవేళ తగ్గించినా కొంత మేర తగ్గిస్తుందేమోనని అంటున్నారు. కొంత తగ్గించినా కిరణ్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్ల ఇప్పటి ప్రభుత్వానికి నష్టం కలిగినా వచ్చే ప్రభుత్వానికి మాత్రం ఉపశమనంగా ఉంటుందని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఎవరికి వారు ఆశలు పెట్టుకున్నారు. రెండుసార్లు అధికారానికి దూరంగా ఉన్న టిడిపి గెలుపు కోసం తాపత్రయ పడుతోంది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎండనక వాననక పాదయాత్ర చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండే తన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వస్తే చంద్రబాబు, వైయస్సార్ కాంగ్రెసు అధికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెసులో మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు.

చిరంజీవి, బొత్స, కిరణ్‌లతో పాటు పలువురు ఈ పోటీలో ముందున్నారు. అయితే, కాంగ్రెసు మరోసారి గెలుస్తుందనే ఆశలు కూడా ఆ పార్టీ నేతల్లో లేవంటున్నారు. చంద్రబాబు ముక్కుపిండి వసూలు చేయడంతో వైయస్ ప్రభుత్వానికి కలిసి వచ్చినందని అంటుంటారు. అలాగే ఇప్పుడు కిరణ్ నిర్ణయాలు వచ్చే ప్రభుత్వానికి కలిసి వస్తాయని అంటున్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాదికి పలు విద్యుత్ ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయంటున్నారు. విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయితే పవర్ కట్ ఇబ్బందులు ఉండవంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+