కరెంట్ ఛార్జీలు తగ్గించిన కిరణ్: బొత్సకు కోపమొచ్చింది

Kiran Kumar Reddy
హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన పలువురికి ఊరట నిచ్చింది. 200 యూనిట్ల వరకు వాడే వారికి పెంపు నుండి ఉపశమనం లభించింది. దీంతో ప్రభుత్వంపై రూ.830 కోట్ల భారం పడనుంది. గురువారం రాత్రి ఉపసంఘంతో సమీక్ష అనంతరం కిరణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించుకునే వారి నుండి పాత చార్జీలే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఆ భారాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించి, డిస్కమ్‌లకు చెల్లించనుంది. అధిష్ఠానం సూచన, విపక్షాల నిరసన, స్వపక్షంలోనే ఆగ్రహం, ప్రజల్లో వ్యతిరేకత కారణమేదైతేనేం సర్కారు ఓ మెట్టు దిగి వచ్చింది. తద్వారా 1.80 కోట్ల మంది గృహ వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. వీరి నుంచి డిస్కమ్‌లు 2012-13 నాటి చార్జీలనే వసూలు చేస్తాయని తెలిపారు. తేడా మొత్తం 830 కోట్ల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లిస్తుందని తెలిపారు.

"అంతకుముందు రూ.5480 కోట్ల సబ్సిడీని ప్రకటించాం. తాజా నిర్ణయంతో ఆ సబ్సిడీ 6,310 కోట్ల రూపాయలకు పెరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 2.55 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అందులో గృహ వినియోగదారులు 2 కోట్ల మంది ఉన్నారు. వీరిలో 200 యూనిట్ల విద్యుత్‌ను వాడుకునే వారు 1.80 కోట్ల మంది. వీరంతా పాత చార్జీలను చెల్లిస్తే సరిపోతుంది'' అని కిరణ్ తెలిపారు.

తగ్గించిన ఛార్జీలపై ప్రతిపక్షాలు పెదవి విరవడంపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ నెల 9న వారు బందు పెట్టుకుంటారో బొంద పెట్టుకుంటారో వారిష్టమన్నారు. సామాన్యులకు, పేదలకు భారం పడకుండా చేశామన్నారు.

సిఎం ప్రకటన హర్షణీయం కాదు: విజయలక్ష్మి

విద్యుత్ చార్జీల పెంపుపై కిరణ్ ప్రకటన హర్షణీయం కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. కుటీర పరిశ్రమలు, వ్యవసాయం, ఉచిత విద్యుత్‌పై సిఎం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని తప్పుబట్టారు. 'కరెంట్ సత్యాగ్రహం' చేస్తున్న ఆమె గురువారం రాత్రి సీఎం ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సిఎం ప్రకటన కంటితుడుపే: రాఘవులు

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిలో ఎలాంటి మార్పు లేనందున 9న తలపెట్టిన బంద్ యథావిధిగా నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు స్పష్టం చేశారు. సిఎం ప్రకటించిన రాయితీలు మొక్కుబడి, కంటితుడుపు చర్యలేనని ఆయన విమర్శించారు. రూ.6500 కోట్లు వసూలుచేసి రూ.880 కోట్లు తగ్గించానని చెప్పడం ప్రజలను అవమానించడమేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక పేర్లతో రేట్లను పెంచి కింది తరగతుల వారికి పాత రేట్లనే కొనసాగిస్తామని చెప్పడం మోసపూరితమని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+