పురంధేశ్వరి మాటే: జగన్‌కు హరి గ్రీన్ సిగ్నల్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఫ్లెక్సీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు, హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉపయోగించుకుంటుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధానంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య మాటల యుద్ధ వాతావరణం ఏర్పడింది. కృష్ణా, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో ఎన్టీఆర్ ఫోటోలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉపయోగించింది.
బాద్ షా సినిమా విడుదల సమయంలోను జగన్ పార్టీ పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల అధికార కాంగ్రెసు పార్టీ కూడా జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమా సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటోను జగన్ పార్టీ వాడుకోవడం చర్చనీయాంశమైంది. బాబాయ్ బాలకృష్ణ, మామయ్య చంద్రబాబు నాయుడుల పైన అసంతృప్తితో ఉన్న జూనియర్ క్రమంగా ఆ పార్టీకి దూరమవుతూ జగన్‌కు దగ్గరవుతున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది.
గత పది రోజులుగా రాష్ట్రంలో ఫ్లెక్సీలపై రాజకీయంగా వేడెక్కింది. దీనిపై ఆయా పార్టీలు భిన్నంగా స్బందిస్తున్నాయి. ఎన్టీఆర్ ఫోటోలు తమ పార్టీ నేతలు వినియోగించుకోవడంలో తమకు సంబంధం లేదని, ఆది వారి వ్యక్తిగతమని, ఫోటోలు వినియోగించుకోవడంలో తప్పు లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పింది. కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
జగన్ పార్టీకి హరి గ్రీన్ సిగ్నల్!
టిడిపి నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఎన్టీఆర్ ఫోటో ఎవరైనా పెట్టుకోవచ్చునని ఆయన అన్నారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి హరికృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే చెప్పవచ్చు. ఇప్పటికే పురంధేశ్వరి తన తండ్రి ఫోటోను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ అభిమానులమంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వినియోగించుకుంటోంది.

ఫ్లెక్సీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

నందమూరి తారక రామారావు ఫోటోను ఉపయోగించుకోవడంపై నందమూరి కుటుంబంలోనే భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ ఫోటోను ఉపయోగించుకునే హక్కు టిడిపి మాత్రమే ఉందని, ఇతర పార్టీలకు లేదని, అవసరమైతే చట్టబద్దంగా చర్యలు తీసుకుంటామని బాలయ్య మూడు రోజుల క్రితం అన్నారు.

ఎన్టీఆర్ ఫోటోను ఎవరైనా వాడుకోవచ్చుననేది పురంధేశ్వరి వాదన. రెండు రోజుల క్రితం ఆమె మాట్లాడుతూ... దేశానికి మహాత్మా గాంధీ, పూలే ఎలాగో ఎపికి ఎన్టీఆర్ అలా అన్నారు. అలాంటి వ్యక్తి ఫోటోను ఎవరైనా వాడుకోవచ్చునని చెప్పారు.

హరికృష్ణ కూడా అదే అభిప్రాయాన్ని ఈ రోజు వ్యక్తం చేశారు. ఆయన పేదల మనిషి కాబట్టి అందరు పెట్టుకోవచ్చునని చెబుతూనే.. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను వాడుకోవడంపై మాత్రం తన తనయుడికి సంబంధం లేదని చెప్పారు.

ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. టిడిపికి అసలు ఆయన ఫోటోను వినియోగించుకునే హక్కు లేదనేది ఆమె వాదన.

సీనియర్, జూనియర్ ఎన్టీఆర్‌ల ఫోటోలను జగన్ పార్టీ వినియోగించుకోవడం, దానిపు దుమారం రేగిన నేపథ్యంలో హరికృష్ణ, పురంధేశ్వరిల వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications