సబితకు కాస్తా ఊరట: సమన్ల జారీకే సిబిఐ మెమో

తేదీని ఖరారు చేస్తూ తమ ముందు హాజరు కావాలని సిబిఐ కోర్టు నిందితులకు సమన్లు జారీ చేస్తుంది. అందువల్ల ఇప్పుడిప్పుడే సబితా ఇంద్రారెడ్డి అరెస్టయ్యే అవకాశం లేదని అర్థమవుతోంది. వాన్‌పిక్ వ్యవహారంలో ధర్మాన ప్రసాదరావును నిందితుడిగా చేర్చినప్పటికీ సిబిఐ అరెస్టు చేయలేదు. ఆయన కోర్టు నిర్దేశించిన ప్రకారం ఎప్పటికప్పుడు కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు. మోపిదేవిని మాత్రం సిబిఐ అరెస్టు చేసింది.
వైయస్ జగన్ కేసులో సిబిఐ సోమవారం ఐదో చార్జిషీట్‌ను సోమవారం కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ చార్జిషీట్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నాలుగో నిందితురాలిగా సిబిఐ చేర్చింది. దాల్మియా సిమెంట్స్‌పై సిబిఐ ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పటికే జగన్ కేసుల్లో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను, మంత్రి ధర్మాన ప్రసాదరావును సిబిఐ నిందితులుగా చేర్చింది. తన పేరును నిందితుడిగా చేర్చిన తర్వాత మోహిదేవి వెంకరమణ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ధర్మాన ప్రసాదరావు చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు.
దాల్మియా సిమెంట్స్‌పై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఎ1గా వైయస్ జగన్, ఎ2గా విజయసాయిరెడ్డి, ఎ3గా దాల్మియా సిమెంట్స్ ఎండి పుణీత్ దాల్మియా, ఎ4గా సబితా ఇంద్రారెడ్డి, ఎ5గా ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఎ6గా గనుల మాజీ ఎండి రాజగోపాల్, ఎ7గా ఈశ్వర్ సిమెంట్స్ ఎండి సజ్జల దివాకర్, ఎ8గా దాల్మియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ ఎస్ మిత్ర, ఎ9గా దాల్మియా సీనియర్ మేనేజర్ నిల్ ధమల్ భేరీ, ఎ10గా దాల్మియా మేనేజర్ జయదీప్ బసు, ఎ11గా రఘురామ్ సిమెంట్, ఎ12గా దాల్మియా సిమెంట్స్, ఎ13గా ఈశ్వర్ సిమెంట్స్ పేర్లు ఉన్నాయి.
హైదరాబాద్‌లోని దిల్‌కుషా అతిథి గృహం నుంచి చార్జిషీట్‌ను సిబిఐ అధికారులు రెండు బాక్సుల్లో సిబిఐ కోర్టుకు తెచ్చారు. సిబిఐ దాల్మియా సిమెంట్స్‌పై 67 పేజీల చార్జిషీట్‌ను రూపొందించారు. మొత్తం 47 మందిని సాక్షులుగా చేర్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందిందని, ఫలితంగా జగన్ కంపెనీల్లో 95 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిందని సిబిఐ ఆరోపిస్తోంది. కడప జిల్లా మైలవరం వద్ద దాల్మియా సిమెంట్స్‌కు 407 హెక్టార్ల సున్నంరాయి గనులను 30 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టారు.
దాల్మియా సిమెంట్స్ జగన్‌కు భారతి సిమెంట్స్‌లో 50 కోట్ల రూపాయలు, జగతి పబ్లికేషన్స్‌లో 45 కోట్లు రూపాయలు పెట్టుబడులుగా పెట్టిందని ఆరోపణ. వైయస్ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందినందుకు ప్రతిఫలంగానే జగన్ కంపెనీల్లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడులు పెట్టిందని సిబిఐ అభియోగం మోపింది. సబితా ఇంద్రారెడ్డిపై 120బి, 409, 420 ఐపిసి సెక్షన్ల కింద సిబిఐ అభియోగాలు మోపింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9, 12, 13, 13(1) కింద అభియోగాలు నమోదు చేసింది.












Click it and Unblock the Notifications