హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ఆఫర్: తెలంగాణ ఎంపీల రహస్య చర్చలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Jagannatham-Vivek
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పిలుపు నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు రహస్యంగా సమావేశమై చర్చలు జరిపారు. పార్లమెంటు సభ్యుడు వివేక్ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు సోమవారం సమావేశమయ్యారు. మందా జగన్నాథం, వివేక్ తెరాసలో చేరుతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. మిగిలిన పార్లమెంటు సభ్యులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తమ పార్టీలో చేరాలన్న కేసిఆర్‌ ఆఫర్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు డోలాయమాన స్థితిలో ఉండడంతో కాంగ్రెస్ వర్గాలలో ఆందోళన పెరిగింది. తెలంగాణ శక్తులను కలుపుకుని ఫ్రంట్‌ ఏర్పాటు చేద్దామన్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సూచనను కేసిఆర్‌ తిరస్కరించడమే కాకుండా పార్టీలో చేరడానికి ఈ నెల 27 గడువు పెట్టినట్లు సమాచారం. పార్టీలో చేరాల్సిందిగా కేసిఆర్‌ తమను ఆహ్వానించిన మాట నిజమేనన్న కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు దేనికైనా సిద్ధమని ప్రకటించారు.

మంత్రి శ్రీధర్ బాబుతో తనకు ఏ విధమైన విభేదాలు లేవని వివేక్ అన్నారు. తెలంగాణపై తేల్చాల్సిన బాధ్యత తమ కాంగ్రెసు పార్టీపైనే ఉందని ఆయన అన్నారు. తెరాసలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. బాబ్లీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వివేక్ విమర్శించారు.

ఇదిలా వుంటే, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండలో ఖండించారు. మే నెల తర్వాత తెలంగాణపై పార్టీ అధిష్టానం నుంచి ప్రకటన వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కట్టుబడి ఉంటారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే మిగతా తెలంగాణ పార్లమెంటు సభ్యులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటానని ఆయన చెప్పారు.

మరో తెలంగాణ వేదిక అవసరం లేదు: జానా

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం ఉద్యమం సాగించడానికి ప్రత్యేక రాజకీయ పార్టీ గానీ ప్రత్యేక వేదిక గానీ అవసరమని తాను భావించడం లేదని రాష్టర్ పంచాయతీరాజ్ మంత్రి కె. జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు తమ పార్టీలో చేరాలంటూ తెరాస నుంచి ఆహ్వానం అందినట్లు పత్రికల్లో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.

పార్టీ బలోపేతానికి ప్రతి రాజకీయ పార్టీ నాయకత్వం కొత్త క్యాడర్‌ను ఆహ్వానించడం రాజకీయాల్లో సహజమేనని జానా రెడ్డి అన్నారు. 2014లోపు తెలంగాణ ప్రకటించే విదంగా కాంగ్రెసు అధిష్టానంపై తాము ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.

English summary
In the wake of Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao (KCR) offer, Congress Telangana MPs met to take the stalk of the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X