జగన్ రాజకీయాలు చేయొద్దా?: అంబటి, ఆనంపై ధ్వజం

ఆనం రాగాన్నే మిగిలిన వారు ఎత్తుకున్నారని విమర్శించారు. వైయస్ చెబితేనే మంత్రులు సంతకాలు చేశారనే విషయం ఇన్నాళ్లకు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఓ న్యాయం, సబితా రెడ్డి, ధర్మాన ప్రసాద రావులకు మరో న్యాయమా అన్నారు. వైయస్ చెబితే సంతకాలు పెట్టామన్న మంత్రులు బుద్ది లేక పెట్టారా? లేక బుద్ధి తక్కువై పెట్టారా? అన్నారు. వారు చదువుకున్నారా? లేదా? అని ప్రశ్నించారు.
వైయస్ పైన విమర్శలు గుప్పించిన ఆనం రామనారాయణ రెడ్డిని ఆయన సోదరుడే వెలి వేశాడన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిల వ్యాఖ్యలు సిబిఐని ప్రభావితం చేసేలా ఉన్నాయన్నారు. అందుకు వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతోందన్నారు.
జివోలన్నీ చట్టబద్దమైనవేనని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో మంత్రులు పేర్కొనగా ఇప్పుడు మరికొందరు మాత్రం తమ మంత్రులు తెలియక సంతకాలు చేశారనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు కాంగ్రెసుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇటీవల జరిగిన పలు ఉన్న ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శిక్ష పడిన ఖైదీ కాదని, కేవలం విచారణలో ఉన్న ఖైదీ మాత్రమే అన్నారు.
ఇది తెలియని కొందరు ఆయన జైల్లోంచి రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారని మండిపడ్డారు. జగన్ ఎందుకు రాజకీయాలు చేయవద్దని ప్రశ్నించారు. ఆయన రాజకీయాలు చేయవద్దని ఏ చట్టమైనా చెబుతోందా అని ప్రశ్నించారు. ఆయనను ఎవరైనా కలువవచ్చునని, మాట్లాడవచ్చునని, ఆయనకు ఆ హక్కుందని, కాదని ఎవరైనా నిరూపిస్తారా? అని సవాల్ చేశారు. టిడిపి, కాంగ్రెసుకువి కుమ్మక్కు రాజకీయాలన్నారు.












Click it and Unblock the Notifications