బాబు సభకు హరికృష్ణ: జూ. ఎన్టీఆర్ హాజరవుతారా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ముగింపు సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీన ముగింపు సభ జరగనుంది. ఈ సభకు రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ హాజరవుతారని అంటున్నారు. బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, తారకరత్నలతో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులు కూడా హాజరవుతారని కచ్చితంగా చెబుతున్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌తో పాటు నారావారి కుటుంబ సభ్యులు కూడా ఈ సభకు వచ్చే అవకాశాలున్నాయి.
ముగింపు సభకు జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారా, లేదా అనేది సందేహంగా మారింది. అయితే, తెలుగుదేశం పార్టీలో ఉన్నవారంత ఈ ముగింపు సభకు వస్తారని పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లను ఉద్దేశించి అన్నారు. ఈ సభ ద్వారా నందమూరి, నారావారి కుటుంబాల మధ్య ఏ విధమైన విభేదాలు లేవనే చాటే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు, ముఖ్యంగా చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో సభకు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.

అయితే, జూనియర్ ఎన్టీఆర్‌పై నందమూరి హీరో బాలకృష్ణకు ఇంకా ఆగ్రహం చల్లారినట్లు లేదు. వైయస్సార్ కాంగ్రెసు తన బొమ్మలను వాడుకోవడాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని బాలకృష్ణ ఇటీవల చెప్పారు. అయితే, తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని, తనలో ప్రవహిస్తోంది నందమూరి వంశం రక్తమని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు గానీ తన బొమ్మలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాడుకోవడాన్ని ఖండించలేదు.
కాగా, ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభ ఉంటుందని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. చంద్రబాబు ముగింపు సభలో ప్రజలు పాల్గొనేందుకు పది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తామని ఆయన గురువారంనాడు చెప్పారు. తెలుగుదేశంలో ఉన్నవారంతా సభకు వస్తారని ఆయన చెప్పారు. చంద్రబాబు ముగింపు సభ ఏర్పాట్లను పార్టీ నాయకులు యనమల రామకృష్ణుడు, తుమ్మల నాగేశ్వర రావు, నన్నపనేని రాజకుమారి, దూళిపాళ్ల నరేంద్ర చౌదరి పర్యవేక్షించారు.












Click it and Unblock the Notifications