రికార్డ్స్ వీరుడు: సాహసం చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు
కోల్‌కతా: అద్భుత విన్యాసాలతో ప్రేక్షకుల మనసుతో పాటు గిన్నిస్ బుక్‌లోను స్థానం సంపాదించిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన శైలేంద్రనాథ్ రాయ్ ఆదివారం ఓ సాహస విన్యాసం చేస్తుండగా మృతి చెందారు. కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాలన్న తాపత్రయంతో బెంగాల్‌లోని తీస్తా నదిపై ప్రమాదకర విన్యాసం చేసి ఆ ప్రయత్నంలోనే అసువులు బాశాడు. తన పిలకను తీగకు వేలాడుతూ నదిని దాటేందుకు ప్రయత్నించిన ఆయన మధ్యలోనే తీగకు చిక్కుకుపోయాడు.
చివరికి గుండె ఆగిపోయి తీగకు వేలాడుతూనే విగతజీవుడయ్యాడు.శైలేంద్రనాథ్ రాయ్ (45) అనే ఆ హోంగార్డు తన పోనీటెయిల్‌తో గతంలో రకరకాల సాహసాలు చేశాడు. సిగతో తీగకు వేలాడుతూ ఎక్కువ దూరం ముందుకు కదిలిన వ్యక్తిగా గిన్నీస్ రికార్డునూ సొంతం చేసుకున్నాడు.

అయితే, మరో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాలన్న ఉద్దేశ్యంతో తీస్తా నదిపై తాజాగా చేపట్టిన సాహసం ఆయనను మృత్యురూపంలో కబళించింది. సేవక్ కొరోనేషన్ బ్రిడ్జి సమీపంలో తీస్తా నదిపై 70 అడుగుల ఎత్తులో, 600 అడుగుల పొడవున్న తీగకు వేలాడుతూ సాహసాన్ని మొదలుపెట్టిన శైలేంద్ర 40 శాతం దూరం ముందుకు కదిలాడు. అక్కడ తీగకు చిక్కుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా ముందుకెళ్లడం సాధ్యం కాకపోవడంతో అలాగే వేలాడుతూ ఉండిపోయాడు.
దీంతో ఆ సాహసాన్ని చూసేందుకు వచ్చిన జనం అరుపులు, కేకలతో కలకలం చెలరేగింది. చివరికి 45 నిమిషాల తర్వాత శైలేంద్రను కిందికి దించారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, శైలేంద్ర అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. కార్డియాక్ అరెస్టు (గుండె వైఫల్యం) కారణంగానే ఆయన మరణించాడని తెలిపారు.
సరైన భద్రతా ఏర్పాట్లు లేక పోవడం వల్ల ప్రేక్షకులు నిస్సహాయంగా ఉండిపోయారు. కాగా, 2011లో రాజస్థాన్‌లోని నీమ్రానా ఫోర్ట్ ప్యాలెస్ వద్ద ఓ తీగకు సిగతో వేలాడుతూ 82.5 మీటర్ల దూరం ముందుకు కదిలిన శైలేంద్ర గిన్నీస్ రికార్డు సృష్టించారు. గతేడాది డిసెంబరులో ఓ చిన్న రైలును లాగి గిన్నిస్ రికార్డ్ సాధించాడు.












Click it and Unblock the Notifications