కర్ణాటక పోల్స్: జైల్లో గాలి, బరిలో లేని సోమశేఖర రెడ్డి

ఈ నేపథ్యంలో గాలి అనుచరుడి పార్టీ ప్రభావం బాగా ఉంటుందని అందరూ మొదట భావించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. మరోవైపు ఈ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి గనుల కేసుకు సంబంధించి జైలులో ఉండగా.. మరో జిల్లాకు కరుణాకర్ రెడ్డి వలస పోయారు. గాలి మరో సోదరుడు సోమశేఖర రెడ్డి పోటీ చేయడం లేదు. ఐదేళ్లలోనే ఓడలు బండ్లయ్యాయి.
ఒకప్పుడు బళ్లారి జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట. అలాంటి కంచుకోటను గాలి సోదరులు బద్దలు చేశారు. 2008 ఎన్నికల్లో బళ్లారి జిల్లాలోని తొమ్మిది సీట్లలో ఏడింట బిజెపిని గెలిపించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉన్నప్పటికీ వీరిదే కీలక పాత్ర. జనార్దన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరూ మంత్రులుకాగా... సోమశేఖర్ రెడ్డి రాష్ట్ర పాల సమాఖ్యకు సారథిగా ఉండేవారు. గాలి సన్నిహితుడైన శ్రీరాములు కూడా మంత్రిగా ఉండేవారు.
బళ్లారిలో వారి హవా కొనసాగేది. ఇప్పుడు తారుమారైంది. గాలి జనార్దన్ రెడ్డి జైలులో ఉన్నారు. కరుణాకర్ రెడ్డి బళ్లారికి బైబై చెప్పి పక్కనే ఉన్న దావణగెరె జిల్లాలోని హరపణహళ్లికి వలస పోయారు. శ్రీరాములు బిజెపి నుంచి విడిపోయి బిఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. సోమశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఇదే పార్టీలో ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
శ్రీరాములు మాత్రం బళ్లారి రూరల్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆయన సమీప బంధువు సురేశ్ బాబు కూడా బిఎస్సార్ కాంగ్రెస్ తరఫున కంప్లి స్థానంలో పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో బళ్లారి జిల్లాలోని మొత్తం స్థానాల్లో బిజెపిని గెలిపించే బాధ్యతను గాలి సోదరులే భుజాన వేసుకున్నారు. ఇప్పుడు మాత్రం కర్ణాటకలో వారి ఊసే వినిపించడం లేదు. గనుల తవ్వకాల్లో పాల్పడిన అక్రమాలే ఈ దుస్థితికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications