సరబ్: తాగిన మత్తులో 'హద్దు' దాటాడు, పోయాడు

విపరీతంగా మద్యం సేవించి మత్తులో అతను సరిహద్దు దాటాడని చెబుతున్నారు. 1990లో ఈ సంఘటన జరిగింది. సరబ్‌జిత్ ఆ రోజు ట్రాక్టర్ తీసుకుని పొలానికి వెళ్లాడు. ఆ తర్వాత ఎప్పటికీ తిరిగి రాలేదు. మద్యం సేవించిన మత్తులో అతను సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడని అతని మిత్రులు చెబుతున్నారు. మద్యానికి బానిస అయిన సరబ్‌జిత్ మొత్తం జీవితాన్నే కోల్పోయాడు.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రొవిన్స్‌లో జరిగిన బాంబు దాడి కేసులో అతన్ని పాకిస్తాన్ దోషిగా నిర్ధారించింది. ఈ బాంబు పేలుడులో 14 మంది మరణించారు. 22 ఏళ్ల పాటు అతను జైలులో ఉన్నాడు. ఇటీవల అతనిపై తోటి ఖైదీలు దాడి చేశారు. దాంతో అతని తల పగిలింది. కోమాలోకి వెళ్లిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతనిపై దాడి చేసిన ఖైదీలపై హత్య కేసు నమోదు చేశారు.
సరబ్‌జిత్ అంత్యక్రియలు అతని కుటుంబ సభ్యుల కోరిక మేరకే జరుగుతాయని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. సరబ్‌జిత్ మృతి పట్ల సుశీల్ కుమార్ షిండే విచారం వ్యక్తం చేశాడు. సరబ్‌జిత్ మృతదేహాన్ని భారతదేశానికి అప్పగించడానికి పాకిస్తాన్ అంగీకరించింది.












Click it and Unblock the Notifications