ఎన్టీఆర్ అనుచరులకు బాబు పొగ పెడుతున్నారా?

పార్టీని వీడివెళ్లిపోతారనే అనుమానం ఉన్న నేతలపై ఓ కన్నేసి ఉంచాలని, వారి కదలికలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలకు సూచించారు. ఆయన శుక్రవారంనాడు పార్టీ నాకులు యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహన్ రావు, లాల్ జాన్ పాషా, మండవ వెంకటేశ్వర రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవినేని ఉమామహేశ్వర రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులతో శుక్రవారం రెండు దఫాలుగా చర్చలు జరిపారు.
పార్టీని ఎవరూ వీడకుండా వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్లిపోతే మరో నాయకుడిని ఇతర పార్టీల నుంచి ఆహ్వానించాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నాయకులను చేర్చుకోవడం ద్వారా తమ పార్టీలో కూడా నాయకులు చేరుతున్నారనే భావనను కలిగించాలని అన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈసారి రెండు రోజుల పాటు మహానాడును నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 27, 28 తేదీల్లో మహానాడు జరుగుతుందని పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. పాదయాత్ర చేయని జిల్లాలో చంద్రబాబు జూన్‌లో బస్సు యాత్ర చేపట్టనున్నారు. అయితే, మహానాడులో నారా, నందమూరి కుటుంబాల మధ్య వైరం మరోసారి తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
పార్టీ కార్పోరేట్ లాబీ పెరుగుతోందని, దానివల్లనే పార్టీకి నష్టం జరుగుతోందని అంటున్నారు. కార్పోరేట్ లాబీ పెత్తనం వల్ల కూడా ఎన్టీ రామారావు అనుచరులు పార్టీని వీడుతున్నారనే అభిప్రాయం ఉంది. దాడి వీరభద్రరావు పార్టీ నుంచి వెళ్లిపోవడం బాధాకరమే అయినప్పటికీ పార్టీకి నష్టం ఏమీ లేదని పార్టీ నాయకులు బయటకు చెబుతున్నారు. కానీ, దాడి వీరభద్రరావు వంటి నేత వెళ్లిపోవడం వల్ల ఏదో మేరకు పార్టీకి నష్టం జరుగుతుందనే అంచనా ఉంది.












Click it and Unblock the Notifications