ధిక్కారముల్ సైతుమా?: కొణతాల వర్గం భేటీ 'దాడి'

దాడి రాకను కొణతాల వర్గం ఏమాత్రం జీర్ణించుకోవడం లేదు. దీనిని కొణతాల వర్గం బాహాటంగానే చెబుతోంది. కొణతాల రామకృష్ణ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే... దాడి విషయంలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాటే తమకు వేదం అంటున్నారు. దాడి రాకతో తమ అనుచరుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అనుచరులతో మాట్లాడాక మీడియాతో మాట్లాడుతానని కొణతాల చెప్పారు.
మరోవైపు దాడి రాకను నిరసిస్తూ కొణతాల వర్గం విశాఖలో ఈ రోజు సమావేశానికి సిద్ధపడింది. కొణతాల వర్గం సమావేశం పైన అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోందని సమాచారం. దాడి రాకను నిరసిస్తూ సమావేశం ఏర్పాటు చేసుకుంటే సీరియస్‌గా ఉంటుందని, తీవ్ర పరిణామాలు ఉంటాయని అధిష్టానం హెచ్చరించినట్లుగా సమాచారం. అయితే, అధిష్టానం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కొణతాల వర్గం మాత్రం సమావేశానికి సిద్ధమవుతోంది.
దాడి పార్టీలో ఉంటే మాత్రం పార్టీని వీడితేనే భవిష్యత్తు ఉంటుందని కొణతాల వర్గం ఆయనతో చెబుతున్నట్లుగా సమాచారం. అనకాపల్లి నియోజకవర్గంపై దాడి తనయుడికి హామీ ఇవ్వడం కొణతాల వర్గం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుందట. అయితే, ఈ వివాదానికి దాడి తెరదించే ప్రయత్నాలు చేశారు. కొణతాల వర్గానికి ఇచ్చిన తర్వాతే తమ వర్గానికి ఇవ్వాలని జగన్‌కు సూచించానని చెప్పారు. అయితే, ఇప్పుడు అలా చెప్పినా తీరా టిక్కెట్లు, ప్రాధాన్యత, ఆధిపత్య విషయానికి వచ్చేసరికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కొణతాల వర్గం భావిస్తోంది.












Click it and Unblock the Notifications