తల నరికి దేవతకు కొడుకును బలి ఇచ్చిన తండ్రి

గ్రామదేవత కలలో కనిపించి తన నాలుగేళ్ల కుమారుడిని బలి ఇవ్వాలని కోరిందని ఓదాల రవి గ్రామస్థులకు చెప్పాడు. దీంతో రవి తన కుమారుడు సాయి కుమార్ తల నరికాడు. రెండు కాళ్లు నరికాడు. కుమారుడి దేహాన్ని బావిలో పడేశాడు.
కుమారుడిని చంపినందుకు రవి ఏ మాత్రం పశ్చాత్తాపానికి గురి కాలేదు. తాను గ్రామదేవతను సంతృప్తి పరిచానని భావిస్తున్నాడు. సంఘటన గురించి గ్రామస్థులు మెట్‌పల్లి పోలీసులకు చెప్పారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి, బాలుడి శవాన్ని బావి నుంచి వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెట్‌పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలావుంటే, నెల్లూరు జిల్లాలోని వట్రపాలెం గ్రామంలో ఏడేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. బాలికను వదిలేసి తల్లిదండ్రులు వెళ్లిపోవడం పోలీసులకు అనుమానం కలిగిస్తోంది. బాలిక తల్లిదండ్రులు ప్రసాదరావు, అలివేలు చెత్తను ఏరుకుంటూ బతుకుతున్నారు.
ఆదివారం రాత్రి ప్రసాదరావు భార్యపై అరవడం వినిపించింది. భార్యకు వైవాహికేతర సంబంధం ఉందని అతను గొడవ పడ్డాడని అంటున్నారు. ఉదయం పూట తన కూతురు బావిలో పడి ఉండడం చూసి అలివేలు దిగ్భ్రాంతికి గురై పారిపోయింది. మృతురాలు జ్యోతి దేహంపై పలు గాయాలున్నాయి. ప్రసాద్ ముందే పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications