జగన్ లెక్క తప్పిందా?: ఆలస్యంగానైనా మేల్కొన్నారా?

పార్టీలో అసంతృప్తుల పట్ల మొదట అధిష్టానం తేలిగ్గా తీసుకున్నప్పటికీ ఇవి రోజు రోజుకు పెరుగుతుండటంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిందట. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా వీటిని మొదట సీరియస్‌గా తీసుకోలేదని, ఇప్పుడు బుజ్జగింపుల బాధ్యతను పలువురికి అప్పగించారని అంటున్నారు. ఇప్పటికే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సోదరులను కూల్ చేయడంలో మధ్యవర్తులు సఫలమయ్యారంటున్నారు.
కొణతాల రామకృష్ణను బుజ్జగించేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పురమాయించారట. విశాఖపట్నంలో దాడి వీరభద్ర రావు, కొణతాల వర్గాల మధ్య వైరాన్ని తేలిగ్గా తీసుకున్నందు వల్లే దాడి పార్టీలోకి తీసుకున్నారని, ఇప్పుడు జగన్ తన అంచనాలు తప్పడంతో కొణతాలను బుజ్జగించే చర్యలు చేపట్టారంటున్నారు. దాడి రాక ఇంత సీరియస్‌గా ఉంటుందని భావించలేదని చెబుతున్నారు.
తాను కొణతాలతో కలిసి పని చేసేందుకు సిద్ధమని దాడి చెబుతుండగా.. కొణతాల మాత్రం ససేమీరా అంటున్నారు. దీంతో ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు అధిష్టానం సిద్ధమైందట. ఇప్పటికే కొణతాలను తమ పార్టీలోకి తీసుకునేందుకు అధికార కాంగ్రెసు ఉవ్వీళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో, విశాఖలో కీలక నేత అయిన కొణతాలను వదులుకునేందుకు సిద్ధంగా లేని జగన్.. నష్ట నివారణ చర్యలు చేపట్టారంటున్నారు.
ఇక జిల్లా పార్టీ కార్యాలయానికి కొండా సురేఖ వర్గం తాళం వేయడం, దానిని తీవ్రంగా పరిగణించిన అధిష్టానం అందుకు సంబంధించిన నలుగురిపై వేటు వేయడం వరంగల్ జిల్లాతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తీవ్ర ప్రకంపనలు రేపింది. తెలంగాణలోని ముఖ్యమైన జిల్లా వరంగల్‌లో పట్టున్న కొండా దంపతుల పట్ల ఇటీవలి వరకు కఠినంగా వ్యవహరించిన అధిష్టానం ఇప్పుడు ఓ మెట్టు దిగిందని అంటున్నారు.
కొండా సురేఖతో పార్టీకి చెందిన శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికే చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన తన చర్చలను వారితో కొనసాగిస్తున్నారట. వేటు వేసిన వారిపై చర్యలను ఉపసంహరించుకనే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కొండా మురళీ రెండు మూడు రోజుల్లో జైల్లో ఉన్న జగన్‌ను కలిసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. అయితే, కొండా దంపతులు ఏ మేరకు కూల్ అవుతారనే విషయం రోజులు గడుస్తే కాని తేలే అవకాశం లేదు. మరోవైపు బిజెపి, తెరాస తదితర పార్టీలో కొండా దంపతులకు నో చెప్పినందు వల్ల వారు కూడా ఓ మెట్టు తగ్గారని అంటున్నారు.












Click it and Unblock the Notifications