కాంగ్రెస్ పెంపుడు కుక్క: సిబిఐపై షర్మిల ఘాటు వ్యాఖ్య

ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మొరగమంటే సిబిఐ మొరుగుతుందని, కరవమంటే కరుస్తుందని ధ్వజమెత్తారు. సిబిఐని అడ్డుపెట్టుకొని జగన్‌పై కాంగ్రెస్ కక్ష సాధిస్తోందని ఆరోపించారు. కోర్టులకు సిబిఐ ఇచ్చే నివేదికను కేంద్ర న్యాయమంత్రి స్వయంగా పరిశీలించి మార్పులు చేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టిందన్నారు. అయినప్పటికీ న్యాయమంత్రిని మాత్రం దోషిగా గుర్తించడం లేదని, అరెస్టు చేయటం లేదని విమర్శించారు.
కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌ను అరెస్టు చేసిన సిబిఐ అదే చార్జిషీటులో పేర్లున్న రాష్ట్ర మంత్రులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. జగన్ సాధారణ ఎంపీగా ఉండి సాక్షులను భయపెడతారని ఆరోపిస్తున్న సిబిఐ.. అన్ని అధికారాలు ఉండి చార్జిషీటులో పేరున్న మంత్రులు మాత్రం సాక్షులను భయపెట్టరని భావించడంలోని అంతరార్థం ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
జగన్ జైలునుంచి బయటకు రాకుండా కాంగ్రెస్, టిడిపిలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రజా వ్యతిరేక పాలన సాగించారని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్, టిడిపిలు ప్రజాగ్రహంలో కొట్టుకుపోతాయని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. కాంగ్రెసును వ్యతిరేకించినందుకే జగన్ పైన అబద్దపు కేసులన్నారు.












Click it and Unblock the Notifications