జగన్ కేసులోని మంత్రులు: సిఎంపై పార్టీ నేతల ఒత్తిడి

అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు రాజీనామా చేయాలన్నది ప్రతిపక్షాల సహజమైన డిమాండ్ అని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. వారిని తొలగిస్తారా లేదా అనేది అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించాలని ఆయన సోమవారం మీడియాతో అన్నారు. కర్ణాటకలో ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి అంశాల వల్లనే తమ పార్టీ గెలిచిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని ఆయన హితవు పలికారు.
కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి అంశాల వల్లనే తమ పార్టీ గెలిచిందని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలోని అవినీతి మంత్రుల విషయంలో పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సోమవారం డిమాండ్ చేశారు. తప్పు నిరూపణ అయ్యేంత వరకు దోషులం కాదంటున్న మంత్రుల వైఖరిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన చెప్పారు.
ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు పదవులను వీడి పార్టీకి పనిచేయాలనే కామరాజ్ ప్లాన్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని కాంగ్రెసు ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ సీనియర్లతోనూ రాజకీయ, ప్రభుత్వ అంశాలేమీ చర్చించడం లేదని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి పార్టీ నేతలందరితో విస్తృతంగా చర్చించాలని ఆయన అభిప్రాయపడ్డారు రాష్ట్ర కాంగ్రెసు ఎదుర్కుంటున్న పలు సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఢిల్లీ వైపు చూడకుండా తమదైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రికి ప్రచారం పిచ్చి..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రచారం పిచ్చి పట్టుకుందని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ హస్తం అరకొర హస్తమని, మొండి హస్తమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కమిషన్ల కోసం నేతలు తమ ముఖాల పరిచయం కోసం చేసుకున్న కక్కుర్తి హస్తమని ఆయన అన్నారు. అమ్మ హస్తం పథకం కింద ఇస్తున్న సరుకులు సగం ధరకే బిజెపి సరఫరా చేరస్తుందని, దమ్ముంటే సరుకుల సరఫరాను తమకు అప్పగించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications