కిరణ్ రెడ్డి బంగారుతల్లి వ్యూహం: నిలదీసిన జానారెడ్డి
హైదరాబాద్: తనపై విమర్శలు చేస్తున్న సీనియర్ మంత్రులకు చెక్ పెట్టే వ్యూహాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరించారు. అయితే, సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి నుంచి ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మంత్రుల విమర్శలను తిప్పికొట్టడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం బంగారు తల్లి పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధిత మంత్రి సునీతా లక్ష్మారెడ్డితో పాటు జానారెడ్డి వంటి సీనియర్ మంత్రులను ఆహ్వానించారు.
బొత్స సత్యనారాయణ, జానారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, వట్టి వసంతకుమార్ వంటి మంత్రులు బంగారు తల్లి పథకంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని గుర్రుమన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రిపై బొత్స సత్యనారాయణ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కిరణ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

అయితే, సమావేశంలో జానారెడ్డి ముఖ్యమంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలోనైనా దాని గురించి చర్చిస్తారా, లేదా అని ఆయన అడిగారు. పథకాలు ప్రకటించే ముందు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. మంత్రివర్గంలో బంగారు తల్లి పథకంపై ఎందుకు చర్చించలేదని అడిగారు. తనకు వేరే పని ఉందంటూ సమావేశం మధ్య నుంచి వెళ్లిపోయారు.
జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి మంత్రులను ఆహ్వానించి ముఖ్యమంత్రి బంగారుతల్లి పథకంపై చర్చించారు. పథకంలోని లోటుపాట్లను చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్‌తో పాటు బంగారుతల్లి పథకం ప్రతిష్టాత్మకమైందని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే, కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో 28 విద్యుత్, రహదారుల ప్రాజెక్టులపై ఆయన చిదంబరంతో చర్చించినట్లు సమాచారం. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిదంబరం హైదరాబాద్ వచ్చారు.












Click it and Unblock the Notifications