ఎవరి వల్ల జైలుకెళ్లారో?: జగన్‌పై పనబాక, వైయస్ వల్లే

రాష్ట్రంలోని కళంకిత మంత్రుల వ్యవహారంపై కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి గుంటూరు జిల్లా బాపట్లలో మంగళవారం స్పందించారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఎవరి వల్ల జైలు పాలయ్యారో అందరికీ తెలుసునని జగన్‌ను ఉద్దేశించి ఆమె అన్నారు. 2004-2009 మధ్య అప్పటి ముఖ్యమంత్రి ఒత్తిడి వల్లే మోపిదేవి, సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావులు సంతకాలు చేశారని ఆమె చెప్పారు.
కాంగ్రెసు చేతిలో సిబిఐ కీలుబొమ్మ, పంజరంలో చిలుక అని కొందరు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని ఆమె అన్నారు. అవినీతికి పాల్పడితే కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎవరినీ ఉపేక్షించరని చెప్పారు. కేంద్రంలో కూడా కళంకిత మంత్రులచే ఆమె రాజీనామా చేయిస్తున్నారని చెప్పారు.
మరోవైపు ఖమ్మం జిల్లా బయ్యారం గనుల దోపిడీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కుట్ర చేశారని, అందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆరోపించిన విషయం తెలిసిందే. అవినీతికి, అక్రమాలకు పాల్పడడం వల్లనే జగన్ జైలుకు వెళ్లాడని ఆయన అన్నారు. ఫ్లెక్సీల్లో జగన్ ఫొటో ముందు జైలు ఊచలు వేయించాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
రాష్ట్రాన్ని దోపిడీ చేసి జైలులో ఊచలు లెక్క పెట్టుకుంటున్న జనగ్ పేరు చెప్పుకుని ఊళ్లోకి వచ్చే నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో లక్ష కోట్ల రూపాయల దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే పేదలు తినే తిండిని, కట్టుకునే బట్టలను కూడా దోచుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. తన మంత్రివర్గ సహచరులను కళంకిత మంత్రులని అనడం తనకు బాధాకరంగా ఉందని మంత్రి పితాని సత్యనారాయణ వేరే సందర్భంలో అన్నారు. ఆరుగురు మంత్రులు కూడా క్విడ్ ప్రోకోకు పాల్పడలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications