కోడలు పని మనిషి కాదు, గెంటివేత కుదరదు: సుప్రీం

తనను ఎప్పుడంటే అప్పుడు పుట్టింటికి పంపించి వేస్తారనే అభిప్రాయాన్ని కూడా ఆమెకు కలిగించకూడదని న్యాయమూర్తులు ఎస్ రాధాకృష్ణన్, దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అత్తగారింట్లో కోడలిని గౌరవంగా చూడడమనేది వివాహ బంధం ప్రాధాన్యతను, పవిత్రతను పెంచేది అవుతుందని, వైవాహిక జీవితం సమయంలో ఆమె కనే కలలు, ఆ కలల పట్ల సమాజం కూడా తగిన విధంగా స్పందించి వాటిని నెరవేర్చుకునేందుకు తోడ్పడుతుందనే విషయానికి అది నిదర్శనంగా నిలుస్తుందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
అయితే చాలా ఇళ్లలో భర్త, అత్త మామలు, ఇతర కుటుంబ సభ్యులు నవ వధువుల పట్ల ప్రవర్తించే తీరును పరిశీలిస్తే సమాజంలో అలాంటి సున్నితత్వం లోపించిందేమోననే భావన కలుగుతోందని న్యాయమూర్తులు అన్నారు. భార్యను చిత్రహింసలకు గురి చేసి ఆమెను ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పినందుకు ఒక వ్యక్తికి అయిదేళ్ల జైలు శిక్ష విధించిన సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
చాలా సందర్భాల్లో అత్తింట్లో కొత్త కోడలి పట్ల సున్నితంగా వ్యవహరించడం లేదని, జీవించాలనే ఆమె కోరికను నాశనం చేసే విధంగా చూస్తోందని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని న్యాయస్థానం అభిప్రాయపడింది. అంతులేని దురాశతో అదనపు కట్నం కోసం, కొన్ని సందర్భాల్లో కట్నం కోసం కాకుండా క్రూర మనస్తత్వంతో అమాయకులయిన కోడళ్లను చిత్రహింసల పాలు చేస్తుండడం ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications