తెలంగాణ: బాబు లేఖను తప్పు పట్టిన ఎర్రబెల్లి

సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లోనే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణపై చంద్రబాబు ఇచ్చిన లేఖలో స్పష్టత లేదని తాను అప్పుడే చెప్పానని ఎర్రబెల్లి అన్నారు. ఈ విషయంపై తాను అలిగితే తనను బుజ్జగించింది కూడా కడియం శ్రీహరేనని ఆయన అన్నారు. కడియం శ్రీహరిని లక్ష్యం చేసే ఉద్దేశంతో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ మాటలు చెప్పారా, తన వ్యూహంలో భాగంగానే ఆ విషయం చెప్పారా అనేది ఇప్పుడు సందేహంగా మారింది.
కడియం శ్రీహరిని పార్టీలో చేర్చుకున్న తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకత్వం దృష్టి పెట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా తమ వైపు లాగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయంటూ ప్రచారం సాగుతోంది. నిజానికి, కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రోజే ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారంటూ టీవీ చానెళ్లలో కాసేపు వార్తలు వచ్చి ఆగిపోయాయి.
ఆ రోజు చంద్రబాబును కలిసిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కడియం శ్రీహరి పార్టీని వీడడాడన్ని తప్పు పడుతూ ఆయన మాట్లాడారు. కానీ, ఆయన మాటల్లో అంత పదును లేదని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, తన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ తర్వాత చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రకటనపై ఎర్రబెల్లి దయాకర్ రావు మీద చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
తన ప్రకటన ద్వారా ఎర్రబెల్లి దయాకర్ రావు తెరాస నాయకులకు చంద్రబాబును విమర్శించడానికి ఓ అస్త్రాన్ని అందించిట్లయింది. ఎర్రబెల్లి మాటలను వాడుకుంటూ తెరాస నాయకులు చంద్రబాబుపై మరింతగా విమర్శనాస్త్రాలను సంధించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications