జూన్ 14న చలో అసెంబ్లీ: భేటీకి కెసిఆర్, కిషన్ హాజరు

తెలంగాణ కోసం పాలకులపై, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. స్టీరింగ్ కమిటీ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 1వ తేదీ నుంచి చలో అసెంబ్లీని విజయవంతం చేయడానికి ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. చలో అసెంబ్లీకి లక్షలాదిగా తరలిరావాలని ఆయన కోరారు.
ప్రజాస్వామ్యయుతంగా చేపట్టే నిరసన కార్యక్రమం చేపట్టే హక్కు తమకు ఉందని, అందువల్ల చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ఆయన అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్తామని, ప్రతి ఒక్కరిని కలుస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ సమాజమంతా జూన్ 14వ తేదీన ఒక్క తాటిపై నిలబడుతుందని ఆయన అన్నారు.
సీమాంధ్ర పార్టీలకు దిమ్మ తిరిగే విధంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ విషయంలో ప్రతిసారి వలస పాలకులు మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దాదాపు గంట పాటు జరిగిన సమావేశంలో చలో అసెంబ్లీ కార్యక్రమం ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చ జరిగింది.












Click it and Unblock the Notifications