విధానాలకు కట్టుబడి ప్రేయసిని వదిలేశా: కరుణానిధి
చెన్నై: విధానాలకు కట్టుబడడం కోసం తాను ప్రేయసితో వివాహాన్ని వదులుకున్నానని డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అన్నారు. ఆత్మగౌరవంతో కూడిన వివాహాలను సమర్థిస్తూ ఆయన తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. 89 ఏళ్ల కరుణానిధి ఓ వివాహ కార్యక్రమంలో మాట్లాడారు.
పాత సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంటేనే తమ కూతురిని తనకు ఇచ్చి వివాహం చేస్తామని తన ప్రియురాలి తల్లిదండ్రులు చెప్పారని, ఇది 1944లో జరిగిందని ఆయన చెప్పారు. సంప్రదాయవిరుద్ధంగా ఆత్మగౌరవంతో జరిగే వివాహానికి వారు అంగీకరించలేదని, పాత సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటేనే తమ కూతురిని ఇస్తామని చెప్పారని ఆయన వివరించారు.

తాను అందుకు ఇష్టపడలేదని, దీంతో ప్రియురాలితో తన వివాహం జరగలేదని కరుణానిధి చెప్పారు. ఆ తర్వాత తాను దయాళును వివాహం చేసుకున్నానని చెప్పారు. దయాళుతో కరుణానిధికి ఎంకె అళగిరి, ఎంకె స్టాలిన్, ఎంకె తమిళరసు, సెల్వి సంతానం కలిగింది.
ఆత్మగౌరవంతో కూడిన హిందూ సంప్రదాయేతర వివాహ పద్ధతిని ద్రావిడ ప్రముఖులు ఇవి రామసామి పెరియార్, సిఎన్ అన్నాదురై ప్రోత్సహించారని, దానివల్ల తనకు ఏ విధమైన సమస్య కూడా రాలేదని కరుణానిధి అన్నారు.












Click it and Unblock the Notifications