ఇప్పటికింతే: కిరణ్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ లేదు

ముఖ్యమంత్రి గురువారం రాత్రి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో సమావేశమై రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలపై చర్చించారు. రాష్ట్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణపై, ఇద్దరు లోక్‌సభ సభ్యులు మందా జగన్నాథం, జి.వివేక్, మాజీ ఎంపి కె.కేశవరావు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడానికి సిద్ధం కావడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తులు కేసులో ఇరుక్కున్న సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులు మంత్రి పదవులకు రాజీనామా చేయటంతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయటంతోపాటు కొందరు అసమ్మతి మంత్రుల తొలగింపు తదితర అంశాల గురించి కిరణ్‌కుమార్ రెడ్డి మరోసారి ఆజాద్‌కు వివరించారని అంటున్నారు. శాసన మండలికి గవర్నర్ కోటా నుండి జరగాల్సిన నాలుగు నామినేషన్ల వ్యవహారం కూడా చర్చకు వచ్చిందంటున్నారు.
రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించినా, శాఖలను మార్చినా అసమ్మతి తలెత్తే ప్రమాదం ఉందని వారంటున్నారు. మంత్రుల శాఖలు మార్చే ప్రక్రియలో హోం శాఖను ఇతరులెవ్వరికి ఇచ్చిన దామోదర రాజనరసింహ అసంతృప్తికి గురి అవుతారని, అదే విధంగా దామోదర్ రాజనరసింహకు హోం శాఖ కేటాయిస్తే ఇతరులు అసంతృప్తిని వ్యక్తం చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హోం శాఖను ముఖ్యమంత్రి వద్ద ఉంచటమే మంచిదని అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
శాసన మండలికి గవర్నర్ నామినేషన్ల విషయం కూడా వివాదాస్పదంగా తయారైంది. మాజీ ఎంపి సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డిని శాసన మండలికి నామినేట్ చేయించేందుకు కిరణ్‌కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. అయితే సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు, మరో ఎంపి ఎం.ఏ.ఖాన్ తదితరులు మాత్రం రాష్ట్ర సేవాదళ్ మాజీ అధ్యక్షుడు కొనుకుల జనార్దన్ రెడ్డిని రీనామినేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాన్ ఈరోజు ఆజాద్‌ను మరోసారి కలిసి జనార్దన్ రెడ్డిని రీనామినేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే లోక్‌సభ సీనియర్ సభ్యుడు కావూరి సాంబశివరావు ఏపి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి తన కూతురు డాక్టర్ శ్రీనాగినిని శాసన మండలికి నామినేట్ చేయటం గురించి మాట్లాడినట్లు తెలిసింది. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఒక వర్గం మాత్రం మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కూతురు వాణిని నామినేట్ చేయాలని కోరుతున్నారు. మాజీ ఐపిఎస్ అధికారి డి.టి నాయక్‌ను నామినేట్ చేసే వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారిందని ఆంటున్నారు. ఏదైనా, సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత నిర్ణయం జరుగుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications