జియా ఆత్మహత్య: పోలీసుల అదుపులో సూరజ్
ముంబై: బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో పోలీసులు ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలీని అదుపులోకి తీసుకున్నారు. నటుడు ఆదిత్య పంచోలీ, జరీనా వాహబ్ కుమారుడైన సూరజ్ దాదాపు ఏడాదిపాటు జియా ఖాన్‌తో డేటింగ్ చేశాడు. జూన్ 3వ తేదీన ముంబైలోని తన నివాసంలో ఉరేసుకోవడానికి ముందు చివరి సారి జియా ఖాన్ సూరజ్‌తోనే మాట్లాడిందని పోలీసులు చెప్పారు.
సూరజ్‌ను, అతని తండ్రి ఆదిత్య పంచోలీని పోలీసులు జూన్ 4వ తేదీన మూడు గంటల పాటు ప్రశ్నించారు. జియా సూసైడ్ నోట్ ఏదీ రాయలేదు. అయితే, జియా ఎవరికీ ఉద్దేశించకుండా ఆరు పేజీల లేఖ రాసింది. ఆ లేఖ కుటుంబ సభ్యులకు లభించింది. దాన్ని వారు పోలీసులకు అందజేశారు.

అయితే, సూరజ్‌ను ఉద్దేశించే జియా ఖాన్ ఆ లేఖ రాసిందని అనుమానిస్తున్నారు. ఏడాది డేటింగ్ తర్వాత నిశ్చితార్థం కోసం ఇచ్చిన హామీని బద్దలు కొట్టినట్లు జియా ఖాన్ ఆరోపించింది. ఆ లేఖలో ఆమె తన వేదనను వెల్లబోసుకుంది.
లేఖలో ఎవరి పేరు కూడా లేదని, ఎవరికి రాసిందనే విషయం జియాను అడగాల్సిందేనని, గతంలో జరిగిన సంఘటలను తనకు చెప్పిందని, తనకు జియా తెలిపిన విషయాలను బట్టి చూస్తే సూరజ్‌ను ఉద్దేశించే ఆ లేఖ రాసిందని భావించాల్సి ఉంటుందని జియా తల్లి రబియా అమీన్ ఖాన్ మీడియాతో అన్నారు. అతనితో సంబంధాన్ని తెంచుకోవాలని తాను జియాను కోరినట్లు ఆమె తెలిపింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!