అదిగో ప్రధాని పోస్ట్: దీదీ వెనుక క్యూ, బాబు సై(పిక్చర్స్)

న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల నాటికి యూపియేతర, ఎన్డీయేతర ప్రభుత్వాలకు ధీటుగా ఫెడరల్ ఫ్రంట్ రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీయేలో కీలకంగా ఉన్న జెడి(యు) అందులో నుండి వైదొలిగి, కొత్త ఫ్రంట్ వైపు వెళ్లాలనే యోచనలో ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రచార సారథిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రావడం జెడి(యు)నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు మింగుడు పడటం లేదు. దీంతో ఎన్డీయే నుండి తప్పుకోవాలని ప్రయత్నిస్తోంది. బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల మహారాజ్ గంజ్ ఉప ఎన్నికలలో జెడి(యు) దారుణంగా ఓడింది. దీంతో ఎన్డీయేలో ఉంటే ముస్లిం ఓట్లు పడవనే ఆందోళనలో జెడి(యు) ఉంది. దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించిన ఫెడరల్ దిశగా వారు అడుగులు వేస్తున్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి, బిజెడి అధినేత నవీన్ పట్నాయక్ కూడా ఫెడరల్‌కు మద్దతు పలుకుతున్నారు.

మూడో ఫ్రంట్‌ను కలరించే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తాము ఫెడరల్ ఫ్రంట్‌లో ఉన్నామని చెబుతున్నారు. జెడి(యు), తృణమూల్ కాంగ్రెసు, బిజెడి, తెలుగుదేశం తదితర పార్టీలు కలిసి ఫెడరల్ ఫ్రంట్‌కు సిద్ధమైతే మరికొన్ని పార్టీలు కూడా ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

డేరింగ్ దీదీకి మద్దతు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు అనూహ్య మద్దతు లభిస్తోంది. స్వయంగా ఆమె 2014 ఎన్నికల నాటికి ప్రంట్‌లోకి ఎక్కువ పార్టీలను తీసుకు వచ్చే ప్రయత్నాలను చేస్తున్నారు. అమె పలు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులతో మాట్లాడుతున్నారు.

మోడీ ఎఫెక్ట్‌తో నితీష్ రాం రాం!

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథిగా ఎన్నికవడం జెడి(యు) అగ్రనేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు మింగుడుపడటం లేదు. ఆయన ఎన్డీయే నుండి తప్పుకొని ఫెడరల్ వైపు చూస్తున్నారు. యూపిఏ, ఎన్డీయేతర కూటములు సాధ్యమేనని, ఎన్డీయేలోని తాజా పరిస్థితులపై తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తనకు బిహార్ అభివృద్ధే ముఖ్యమని చెప్పారు. బిజెపి అగ్రనేతలు తనతో మాట్లాడారన్నారు.

మూడుకు మూడినట్లేనా?

మూడో ఫ్రంట్ అని కలవరించే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాము ఫెడరల్ ఫ్రంట్‌లోను భాగస్వాములమంటున్నారు. తాను పలువురు ప్రాంతీయ పార్టీల అధినేతలతో మాట్లాడుతున్నానన్నారు. ప్రాంతీయ పార్టీలో దేశంలో రోజురోజుకు బలపడుతున్నాయని బాబు చెప్పారు.

నవీన్ అండ

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో మమతా బెనర్జీ మాట్లాడారు. నవీన్ కూడా ఫెడరల్‌కు అనుకూలంగా ఉన్నారు. మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలని నవీన్ పట్నాయక్ భావిస్తున్నారు.

ఎన్డీయేకే జయలలిత జై

పలు ప్రధాన ప్రాంతీయ పార్టీలు మూడో, ఫెడరల్ ఫ్రంట్లకు జై కొడుతుంటే తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మాత్రం ఎన్డీయేకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయేకు జయలలిత కొంతకాలంగా అనుకూలంగా కనిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమె మాట్లాడుతూ.. మోడీ తనకు మంచి స్నేహితుడు అని చెప్పారు.

కరుణానిధి తేల్చుకుంటారా?

యూపిఏపై ఆగ్రహంతో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధి 2014 నాటికి ఏ కూటమిలో ఉంటారో ఇంకా తేల్చుకోలేదనే చెప్పవచ్చు. జయలలిత ఎన్డీయేలో ఉంటే ఆయన అసంతృప్తితోనైనా యూపిఏలో కొనసాగుతారా? లేక థర్డ్, ఫెడరల్ వైపుకు వెళ్తారా? చూడాలి. ఆయన ఫెడరల్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ములాయం, మాయలు ఎటువైపు?

యూపిఏ 2కు బయట నుండి మద్దతిస్తున్న సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెసుతో అంటకాగే అవకాశాలు లేవు. కేవలం కేసుల నుండి బయట పడేందుకే ములాయం సింగ్ యాదవ్, మాయావతిలు యూపిఏకు బయటి నుండి మద్దతిస్తున్నారు. అయితే థర్డ్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న ములాయం ఫెడరల్ వైపుకు వెళ్లే అవకాశాలు తక్కువే. మాయావతి ఫెడరల్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

జగన్ ఎటు?

రాష్ట్రంలో చంద్రబాబు ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ అంటున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎటు వైపు వెళ్తుందనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. చంద్రబాబు ఎన్డీయేకు మద్దతిచ్చినా, ఫ్రంట్‌ల వైపు వెళ్లినా జగన్ యూపిఏకు మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ఫెడరల్ ఫ్రంట్‌కు పలు ప్రాంతీయ పార్టీలు ముందుకు వస్తున్నా

ఫెడరల్ ఫ్రంట్‌కు పలు ప్రాంతీయ పార్టీలు ముందుకు వస్తున్నా, ఆ ఎన్నికలలో ఆయా పార్టీలు ఎన్ని స్థానాలు గెలుస్తాయనే ప్రశ్న పక్కన పెడితే, ఫెడరల్‌లో 'ప్రధాని' చిక్కులు ఉన్నాయి. ఫెడరల్ ప్రయత్నాలు చేస్తున్న మమతా బెనర్జీ, అందులోకి రావాలని చూస్తున్న నితీష్ కుమార్, అటువైపు వెళ్లే అవకాశాలున్న మాయావతిలు ప్రధాని పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ప్రధాని పీఠం చిచ్చు రేపే అవకాశాలున్నాయి. అదే నిజమైతే ఫెడరల్ విచ్ఛిన్నం కూడా కావొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+