సోనియా థాట్: ప్యాకేజీయా, రాయల తెలంగాణనా?

తెలంగాణ సమస్యను పరిష్కరిస్తే ఆందోళనలు ఉండవని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సమావేశంలో అంటే, శాసనసభ సమావేశాలు, పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత సమస్యపై నిర్ణయం చేద్దామని ఆమె చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు.
మళ్లీ ప్యాకేజీని, రాయల తెలంగాణను కాంగ్రెసు అధిష్టానం తెరపైకి తెచ్చింది. హైదరాబాదును మినహాయించి తెలంగాణ జిల్లాలకు, ఇతర ప్రాంతాల్లోని మూడు వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలనే ప్రతిపాదన మొదటిదని చెబుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఇతర ప్రాంతాల్లోని వెనకబడిన జిల్లాల అభివృద్ధికి 20 వేల నుంచి 25 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక రెండో ప్రతిపాదన రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను, తెంలగాణతో కలిపి రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రతిపాదన మరోటి అని చెబుతున్నారు. పిసిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో కాంగ్రెసు అధిష్టానం ఈ ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. డి. శ్రీనివాస్ అధిష్టానం పెద్దలతో సమావేశమవుతూ వస్తున్నారు.
అయితే, ఈ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కొట్టి పారేస్తున్నారు. కాంగ్రెసు అధిష్టానానికి లీకులు ఇవ్వడం అలవాటేనని తెరాస శానససభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని తెరాస మరో శానససభ్యుడు కెటి రామారావు అన్నారు. ప్యాకేజీలు, పాలక మండళ్లు పాతబడిన విధానాలని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ సమస్య పరిష్కారానికి తమ పార్టీ అధిష్టానం రెండు ప్రతిపాదనలను ముందుకు తెచ్చినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, పార్లమెంటు సభ్యులు శనివారం సమావేశమయ్యారు. ఈ ప్రతిపాదనలపై వారు చర్చించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలపై చర్చించడానికి విస్తృత స్థాయిలో ఈ నెల 18వ తేదీన సమావేశం నిర్వహించాలని వారు నిర్ణయించారు.
సమావేశం అనంతరం మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్య హోం మంత్రి జె. గీతారెడ్డిని కలిశారు. తెలంగాణపై తాము పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చామని జానా రెడ్డి శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఆ ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. మరోసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షను అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నామని, అది ఏ రకంగా చేయాలనే ఆలోచన చేస్తున్నామని, అందులో భాగంగానే తాము సమావేశమయ్యామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications