పంచాయతీ తర్వాత చూద్దాం: తెలంగాణపై సోనియా

ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కోర్ కమిటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆహార భద్రతా బిల్లు, కేబినెట్ విస్తరణ, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు, తెలంగాణ అంశంపై చర్చలు జరిగినట్లు తెలియవచ్చిందని సమాచారం.
ప్రత్యేక తెలంగాణ అంశానికి సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గులాం నబీ అజాద్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలు హాజరయ్యారు. శుక్రవారం జరిగిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించిన తీరు బాగుందని అజాద్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్ననిర్ణయాలు బాగున్నాయని ఆయన చెప్పారని తెలుస్తోంది.
తెలంగాణ అంశాన్ని నాన్చడంవల్లే రాష్ట్రంలో ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్నాయని, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సుశీల్ కుమార్ షిండే సూచించినట్లు తెలుస్తోంది. సుశీల్ కుమార్ షిండే సూచనకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారని అంటున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని, అవి ముగిసిన తర్వాత రాష్ట్ర నాయకులను ఢిల్లీకి పిలిపించి తెలంగాణపై నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications