ఉద్యమం ముక్కలు: కెసిఆర్‌పై టిటిడిపి ముప్పేట దాడి

ప్రజలు కడియం శ్రీహరిని స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆయన ముఖం చూసి గెలిపించలేదని, చంద్రబాబు, ఎన్టీఆర్‌స ముఖం చూసి ఓట్లేశారనే విషయాన్ని కడియం మరిచిపోయారని అన్నారు. లెక్చరర్‌గా డొక్కు స్కూటర్‌పై తిరిగే కడియం శ్రీహరికి అన్నం పెట్టిన టిడిపిని విమర్శిస్తూ పదవీ వ్యామోహంతో పార్టీ మారారని ఆరోపించారు.
ఉద్యమం ముక్కలు: టిటిడిపి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సొంత కార్యాచరణతో స్వతంత్ర పోరాటం చేపట్టనున్నట్లు టిడిపి తెలంగాణ ఫోరం ప్రకటించింది. వారం రోజుల్లో తమ కార్యాచరణను ఖరారు చేసుకొని ప్రజల్లోకి వెళ్తామని, గ్రామస్థాయి నుంచి పార్లమెంటు వరకూ పోరాటం చేస్తామని తెలిపింది. శనివారం టిడిఎల్పీ కార్యాలయంలో ఆపార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ మాట్లాడారు.
కాంగ్రెస్‌కు అమ్ముడుపోయిన కెసిఆర్ తెలంగాణ కోరుకొనేవారందరినీ చీలికలు పేలికలు చేయడానికి కంకణం కట్టుకొన్నారని, అందుకే ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నారని వీరయ్య విమర్శించారు. జెఏసి భాగస్వామ్యపక్షాలనూ సంప్రదించకుండా కెసిఆర్ ఏకపక్షంగా బంద్ పిలుపునిచ్చారని, జెఏసి ప్రజల కోసం కాదని, కెసిఆర్, తెరాసను సంతోషపెట్టడానికే ఉందన్నారు. ఉద్యమంలో మరెవరూ ఉండరాదన్న కెసిఆర్ ఆలోచనకు జెఏసి వంత పాడుతోందా అని ప్రశ్నించారు.
ఒంటెత్తు పోకడ: మోత్కుపల్లి
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒంటెత్తు పోకడలు, దొరతనానికి నిరసగానే ఆయన పిలుపునిచ్చిన బంద్‌ను తెలంగాణ ప్రజలు విఫలం చేశారని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు శనివారం మండిపడ్డారు. కెసిఆర్ ఫాంహౌస్‌లో పడుకుని డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మరని, చలో అసెంబ్లీ సఫలమైందని చంకలు కొట్టిన కెసిఆర్, బంద్ ఎందుకు విఫలమైందో చెప్పాలన్నారు.
చలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల హడావుడి తప్ప తెరాస నాయకుల పాత్రే లేదని, తెలంగాణకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని ఒకప్పుడు కెసిఆర్ బల్లగుద్ది వాదించాడని, ఇప్పుడేమో కావాలంటున్నాడని విమర్శించారు. ఆయనది నాలుకా.. తాటిమట్టా? అని ప్రశ్నించారు. కెసిఆర్ ఎంపీ అని, నిర్ణయం జరగాల్సింది ఢిల్లీలో అని తెలుసుకోవాలన్నారు. పార్లమెంటు ముట్టడికి ఎందుకు పిలుపు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. లోక్‌సభలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందు ఎందుకు మట్లాడరన్నారు.
ఆమె దగ్గర సొమ్ములు తెచ్చుకోవడంవల్లే నోరు పెగలట్లేదని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం కోరుతూ శనివారం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి శ్రీనివాస్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ పార్టీపరంగా ఆదుకుంటామని ప్రకటించారు. కెసిఆర్ కల్పించిన భ్రమలే యువత ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు ఆరోపించారు. హరీశ్ రావు ఒంటిమీద కిరోసిన్ పోసుకుంటాడుగానీ, అంటించుకోవడానికి అగ్గిపెట్టె దొరకదని ఎద్దేవా చేశారు.
నిన్న తెరాస ఎమ్మెల్యేలు అసెంబ్లీ భవనం ఎక్కారుగానీ కెసిఆర్‌పై నమ్మకం లేకనే కిందకు దూకలేదన్నారు. ముప్ఫైఏళ్ల రాజకీయ అనుభవంతో ఒక దళితునిగా చెబుతున్నానని, కెసిఆర్ మాటలు నమ్మి ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు ప్రాణాలు తీసుకోవాద్దని విజ్ఞప్తి చేశారు. రేపటి ఎన్నికల్లో గెలిచేది, తెలంగాణ తెచ్చేది టిడిపియేనన్నారు. తమపై దాడి చేయబోయిన న్యాయవాదులు కెసిఆర్ పాలేర్లలా పని చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications